కారు ముందు టైరుకు వేసిన లాక్
గన్నవరం: రాంగ్ పార్కింగ్ చేశాడని ఓ వాహనదారుడిపై ఎయిర్‌పోర్టు అధికారులు దురుసుగా ప్రవర్తించిన సంఘటన వివాదస్పదమైంది. వివరాలీలా వున్నాయి. గుంటూరుకు చెందిన జీహెచ్. రావు హైదరాబాద్ నుంచి విమానంలో వస్తున్న బందువును తీసుకువెళ్ళేందుకు కారుతో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. టెర్మినల్ భవనం ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాన్ని నిలిపి బందువును రిసీవ్ చేసుకుని కారు వద్దకు వచ్చారు. ఇంతలో కారు ముందు టైరును లాక్‌చేసి ఉండడం చూసి అవాక్కయ్యాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అడుగుగా రాంగ్ పార్కింగ్‌లో పెట్టినందుకు టెర్మినల్ బాధ్యతలు చూస్తున్న అధికారి యశ్వంత్ లాక్‌చేసినట్లుగా చెప్పారు. దీనితో జీహెచ్.
రావు సదరు యశ్వంత్‌ను కలువగా రూ. 3 వేలు జరిమానా కట్టి కారును తీసుకువెళ్ళాలని చెప్పాడు. ఇదేమని ప్రశ్నించిన ఆతనిపై యశ్వంత్ దురుసుగా ప్రవర్తించడంతో వీరి మధ్య మాట మాట పెరిగి వాగ్వావాదానికి దారితీసింది. జరిమానా కట్టిన తర్వాతే కారు విడుదల చేస్తామని చెప్పడంతో చేసేది లేక డబ్బులు కట్టి కారును తీసుకువెళ్ళారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రయాణికులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, తోటి వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అధికారులు దురుసు ప్రవర్తనతో ఎయిర్‌పోర్టుకు చెడ్డపేరు తీసుకువస్తున్నారంటూ మండిపడుతున్నారు. రాంగ్ పార్కింగ్‌లో వాహనాలు నిలపవద్దని చెప్పాల్సిందిపోయి వేల రూపాయిలు జరిమానా రూపంలో వసూలు చేయడం దారుణమని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment