సత్తాచాటిన శివాని, రచన
ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: తెలుగమ్మాయిలు అమినేని శివాని, రచన రెడ్డిలు ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అస్సాంలోని చాచల్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో వీరిద్దరు బాలికల అండర్-14, 16 సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు.
అండర్-14 ప్రిక్వార్టర్స్‌లో శివాని 4-2, 4-1తో భక్తి పార్వని (గుజరాత్)పై, రచన 4-0, 5-3తో అలీషా సమల్ (ఒడిశా)పై, ముబషిర అంజూమ్ షేక్ (ఏపీ) 4-1, 5-3తో లెనిన్ జమిర్ (అస్సాం)పై, రష్మిక 4-0, 5-3తో తనీషా కశ్యప్ (అస్సాం)పై గెలుపొందారు. అండర్-14 బాలుర విభాగంలో శశాంక్ (ఏపీ) 4-1, 5-3తో రోనిత్ బొర (అస్సాం)పై, రోహిత్ (ఏపీ) 4-1, 4-2తో సందేశ్ (కర్ణాటక)పై నెగ్గారు. గౌరవ్ (ఏపీ) 2-4, 0-4తో అమిత్ బెనివాల్ (హర్యానా) చేతిలో పరాజయం పాలయ్యాడు. అండర్-16 బాలికల ప్రిక్వార్టర్స్‌లో శివాని 5-3, 4-1తో అలీషా (ఒడిశా)పై, రచన 4-1, 4-0తో లెనిన్ జమీర్ (అస్సాం)పై విజయం సాధించారు. బాలుర ప్రిక్వార్టర్స్‌లో శశాంక్ 1-4, 2-4తో యుగల్ బన్సల్ (ఢిల్లీ) చేతిలో కంగుతిన్నాడు.