ఫార్చూన్ లిస్టులో ఐవోసీ టాప్
న్యూఢిల్లీ: ఆదాయాలపరంగా ఈ ఏడాది ఫార్చూన్ 500 భారత కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) అగ్రస్థానం దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంలో నిల్చింది. ఈ రెండు ఇలా టాప్ 2 స్థానాల్లో నిలవడం ఇది వరుసగా ఆరోసారి కావడం గమనార్హం. ఐవోసీ రూ. 4,51,911 కోట్ల వార్షికాదాయంతో నంబర్ వన్‌గా నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 3,82,565 కోట్ల ఆదాయాలతో రెండో స్థానం దక్కించుకుంది.
రూ. 2,67,025 కోట్లతో టాటా మోటార్స్ అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పటిదాకా మూడో స్థానంలో నిల్చిన భారత్ పెట్రోలియం.. రూ. 2,40,367 కోట్ల ఆదాయంతో అయిదో స్థానానికి పడిపోయింది. మరోవైపు, ఎస్బీఐ రూ. 2,57,289 కోట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. బిజినెస్ మ్యాగజైన్ ఫార్చూన్ ఇండియా ఈ జాబితాను రూపొందించింది. దీని ప్రకారం జాబితాలోని 500 కంపెనీల ఆదాయాలు 2014తో పోలిస్తే 2015లో స్వల్పంగా 2.7% పెరగ్గా లాభాలు 5.9% తగ్గాయి. టాప్-10లో హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో, టీసీఎస్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.