ఖాయిలా పరిశ్రమలపై వైఖరేంటి?
బీజేఎల్పీ నేత కె. లక్ష్మణ్
హైదరాబాద్: ఆల్విన్, ప్రాగా టూల్స్, నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్స్, రేయాన్స్ ఫ్యాక్టరీ... తదితర మూతపడ్డ భారీ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే విధానాలేమిటో గవర్నర్ ప్రసంగంలో కనిపించలేదని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన సింగరేణి కాలరీస్ కార్మికులకు ఇచ్చిన అడ్వాన్స్‌ను వేతనంలో సర్దుబాటు చేస్తుండటం దారుణమని, వారి సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తరహాలో ఉందని, సీబీఐ దర్యాప్తు పేరుతో రెండు పడక గదుల ఇళ్ల పథకానికి శ్రీకారమే చుట్టలేదని, కేజీ టూ పీజీ పథకంపై ఎటూ తేల్చలేదన్నారు.
ఇలాంటి కీలకమైన వాటిపై గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదన్నారు. తెలంగాణలోని చాలా విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరని, ఓ ఎంపీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులిచ్చిన సీఎం కేసీఆర్.. మహిళలను మంత్రులు చేయకపోవటం విడ్డూరమన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, సకాలంలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇందిరాపార్కులో వినాయక్‌సాగర్ ఏర్పాటుకు తాము పూర్తి వ్యతిరేకమని, సాగర్ ప్రక్షాళన కోసం అందులోని నీటిని ఖాళీ చేస్తే ఆ నీళ్లు పారే కాలువతో పక్కనున్న బస్తీలు అనారోగ్యం పాలవుతాయని తెలిపారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని లక్ష్మణ్ సూచించారు.