కీచక గురువులకు రిమాండ్
చల్లపల్లి : జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిన వక్కలగడ్డకు చెందిన ఇంటర్ విద్యార్థిని మృతికేసులో నిందితులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, ఇంగ్లిష్ టీచర్‌ను ఆదివారం అవనిగడ్డలోని ఏజేఎఫ్‌సీఎంఈ జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థిని రెండు నెలల కిందట అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
దీనిపై ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మల్లుపెద్ది శివరామప్రసాద్, అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్ చిరువోలు జనార్దనప్రసాద్‌ను లైంగికదాడి, పోస్కో చట్టాల కింద శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సెలవు కావడంతో అవనిగడ్డలో ని మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు.
మహిళా సంఘాల ఆగ్రహం
కీచక గురువు అరెస్ట్ ఉదంతాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్ని పలువురు మహిళా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల మహిళా నేతలు అదివారం చల్లపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులిద్దరిపై వైఎస్సార్సీపీ మండల మహిళా కన్వీనర్ వల్లూరి ఉమ, నాయకురాలు బొందలపాటి లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కఠినంగా శిక్షించాలి
విద్యార్థిని మృతికి కారకులైన ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు వల్ల విద్యార్థినులు చదువు కోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి.
- వల్లూరి ఉమ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, చల్లపల్లి
అవార్డును వెనక్కి తీసుకోవాలి
ఈ కేసులో తాతయ్య వయస్సు అయిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మల్లుపెద్ది శివరామ ప్రసాద్‌కు గతంలో వచ్చిన జాతీయ ఉత్తమ అవార్డును వెనక్కి తీసుకోవాలి. మరో ఉపాధ్యాయుడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని జీవితాన్ని సగంలోనే బుగ్గిపాలు చేసిన ఈ ఇద్దరినీ కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలి.
- బొందలపాటి లక్ష్మి,వైఎస్సార్సీపీ నాయకురాలు, చల్లపల్లి