47 ఏళ్ల తర్వాత సాధించాడు!
జైపూర్: మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటుంటారు. రాజస్థాన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 81 ఏళ్ల అజిత్ సింగ్ సింఘ్వి విషయంలో ఇదే జరిగింది. ఎల్ఎల్ బీలో సాధించిన గోల్డ్ మెడల్ 47 ఏళ్ల తర్వాత ఆయన అందుకున్నారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి 1969లో ఆయన ఎల్ ఎల్ బీ చేశారు. పరీక్షల్లో అందరికంటే ఆయన ఎక్కువ మార్కులు సాధించారు. అయితే ప్రతిభాసామర్థ్యాల ఆధారంగా ఆయన రెండో స్థానంలో నిలిచినట్టు యూనివర్సిటీ ప్రకటించింది. మార్కులు ఒకటే కొలమానం కాదని తెలిపింది.
యూనివర్సిటీ నిర్ణయంపై కోర్టుకెక్కారు. అత్యధిక మార్కులు సాధించిన తనకు మొదటి స్థానం ఇవ్వాలని, దీనికి అనుగుణంగా ఫలితాన్ని తిరిగి ప్రకటించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. చివరకు రాజస్థాన్ హైకోర్టులో కేసు గెలిచారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో సింఘ్వికి రాజస్థాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జేపీ సింఘాల్ గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు.