బీజేపీ ఎంపీ కన్నుమూత
న్యూఢిల్లీ: అజ్మీర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌లాల్ జాట్ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎయిమ్స్ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్(ఎస్ఎంఎస్) ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో నేడు కన్నుమూశారు. సన్వర్‌లాల్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
సన్వర్‌లాల్ 1955, జనవరి 1న అజ్మీర్‌లో జన్మించారు. ఎంకామ్, పీహెచ్డీ చేసి ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. రాజస్థాన్ మంత్రిగానూ పనిచేశారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014 నుంచి 2016 వరకు జలవనరుల సహాయ మంత్రిగా ఆయన పనిచేశారు. రాజస్థాన్ కిసాన్ ఆయోగ్ చైర్మన్‌గానూ ఉన్నారు.