గిరిజన సంక్షేమంలో ప్రక్షాళన
మంత్రి చందూలాల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఆ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నిరంతర పర్యవేక్షణ కోసం జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్), మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) పరిజ్ఞానాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు నిజాయితీ అధికారుల సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు.
పథకాల అమలుపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ‘గిరిజన ఆర్థిక పరిశోధన కేంద్రం’ నెలకొల్పుతామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధతో కలసి శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. గిరిజన వసతి గృహాల విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదు కోసం రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
సౌర విద్యుత్ దీపాలతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. చలి తీవ్రత పెరిగినందున వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల వసతి గృహాలకు 5 వేల దుప్పట్లు పంపించామన్నారు. గిరిజన మహిళల వివాహాలకు ఆర్థిక సాయం అందించే కల్యాణ లక్ష్మీ పథకం కింద 408 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ పథకంపై విస్తృత ప్రచారం కోసం 27న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.
ఫిబ్రవరి 14, 15 తేదీల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు.. జయంతి ఉత్సవాల కోసం ఇప్పటికే ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల నిధులను విడుదల చేశామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద నిర్వాసితులవుతున్న 760 గిరిజన కుటుంబాలకు పునరావాసం, ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల 22న నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతాని చెప్పారు.