పోలవరంపై న్యాయపోరాటం చేస్తాం
ఆదివాసీలతో పెట్టుకుంటే బాగుపడరు
మానుకోట ఎంపీ అజ్మీర సీతారాంనాయక్
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడంపై పార్లమెంట్లో గళం విప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తామని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. శనివారం రాత్రి హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల అభినందన కార్యక్రమం జరిగింది.
ఇందులో ఎంపీ సీతారాంనాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఇస్తూనే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు.
‘తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని ప్రత్యేక రాష్ట్రంగా కావాలని కోరితే కోత పెట్టింది.. స్వపరిపాలన కోరితే గవర్నర్ పాలన చేసింది.. హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉండాలని అడిగితే ఉమ్మడి రాజధానిని చేసింది.. ప్రత్యేక హైకోర్టు కావాలంటే ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు చేసింది.. అని అన్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తూనే ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, దీనిపై పార్లమెంట్లో న్యాయపోరా టం చేస్తామని స్పష్టం చేశారు.
ఆదిమజాతికి చెందిన ఆదివాసీలతో పెట్టుకున్న వారు బాగుపడరని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు యూనివర్శిటీ నుంచి మొదలై అన్ని శాఖలకు విస్తరించాయని, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నింటినీ అమలు చేయడానికి కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్ మాట్లాడుతూ ‘కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసు.. వారు చేసిన ప్రతి పోరాటంలో తాను పాల్గొన్నాను.. వాటిని పరిష్కరించే బాధ్యతను తీసుకుంటాను’ అని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలు త్వరలో తీరుతాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, ఐక్య వేదిక కన్వీనర్ కొలిపాక మధు, ప్రతినిధులు పి.రాధాకృష్ణ, డాక్టర్ శరత్, డాక్టర్ రావుల జగదీశ్వర్‌ప్రసాద్, బార్గవ్ శాస్త్రి, మైదం రాజు, రమేశ్, అరుణాదేవి, సూర్యకిరణ్, శివకిరణ్, జానకీరాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.