ఇక పాకిస్థాన్‌లోనూ మన 'ఆకాశవాణి'
''ఆకాశవాణి.. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జీడిగుంట నాగేశ్వరరావు'' ఇలాంటి మాటలు వినకపోతే చాలామందికి తెల్లవారేది కాదు. ఆలిండియా రేడియో ప్రసారాలు అంతగా మన దేశ వాసులకు అలవాటు అయిపోయాయి. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా మన ఆకాశవాణి ప్రసారాలు వినిపిస్తాయి. 300 కిలోవాట్ల డిజిటల్ రేడియో మాండియల్ (డీఆర్ఎం) ట్రాన్స్మిటర్ను జమ్ములో ఏర్పాటుచేయడం ద్వారా ఆలిండియా రేడియో ప్రసారాల సిగ్నళ్ల సామర్థ్యాన్ని కేంద్రం పెంచింది. దాంతో ఇది సాధ్యమవుతోంది.
జమ్ము స్టేషన్ నుంచి ప్రసారం చేసే కార్యక్రమాలు ఇప్పుడు పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో కూడా వినిపిస్తాయి. డీఆర్ఎం ట్రాన్స్మిషన్ వల్ల శబ్దాలు మరింత స్పష్టంగా, గట్టిగా వినిపిస్తాయని, ఎక్కడా సిగ్నల్ సరిగా లేకపోవడం ఉండదని ఏఐఆర్ వర్గాలు తెలిపాయి. ఆలిండియా రేడియోలోని రేడియో కశ్మీర్ జమ్ము స్టేషన్ కార్యక్రమాలను పాక్ ఆక్రమిత కశ్మీర్, ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వినొచ్చు.
ఉధంపూర్‌లో కూడా రేడియో స్టేషన్ కావాలని చాలాకాలంగా అడుగుతుండటంతో అక్కడ సైతం ఒక స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ ఏర్పాటుచేసే స్టేషన్ నుంచి 55 కిలోమీటర్ల దూరం వరకు సిగ్నల్ స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు కావల్సిన భూమిని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది.