దొరకని అఖిల్ జాడ
చౌటుప్పల్ :హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. మూడు రోజు లుగా రెస్క్యూ టీం గాలిస్తున్నా అతని జాడ దొరకలేదు. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన మాచర్ల సుదర్శన్-సబిత దంపతులకు ఇద్దరు కుమారులు. 15సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి దిల్‌సుఖ్‌నగర్‌లో స్థిరపడ్డారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనేది వీరి కోరిక. పెద్దకుమారుడు విశాల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగరీత్యా ముంబైలో శిక్షణ పొందుతున్నాడు.
చిన్నకుమారుడు అఖిల్(20) బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్టడీటూర్‌లో భాగంగా ఈ నెల 3న కళాశాల ఆధ్వర్యంలో స్నేహితులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. బియాస్ నదిలో గల్లంతైన 24మంది విద్యార్థులలో ఈయన కూడా ఉన్నాడు. ఈయన గల్లంతైన విషయం తెలియగానే తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్‌కు హుటాహుటిన తరలివెళ్లారు. కొడుకు కడసారి చూపైనా దక్కుతుందా, లేదా అని కన్నీరుమున్నీరవుతున్నారు. మూడు రోజులుగా రెస్క్యూ టీం, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాల కోసం గాలిస్తున్నా ఎక్కడా అఖిల్ జాడ దొరకలేదు.