akhundzada
-
Taliban: అజ్ఞాతం వీడిన తాలిబన్ చీఫ్, 10 నిమిషాల ఆడియో?
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకొని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్ల చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా తొలిసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అఖుంద్జాదా అజ్ఞాతం వీడకపోవడంతో అతను మరణించాడని వదంతులు మొదలయ్యాయి. వీటికి తెరదించుతూ తమ నేత కాందహార్‌లోని జామై దరూల్ అలూమ్ హకీమియా మదర్సాను సందర్శించినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే అఖుంద్జాదా పర్యటన వీడియోలు, ఫోటోలేవీ బయటపెట్టలేదు. అతను మాట్లాడినట్టుగా భావిస్తున్న 10 నిమిషాల ఆడియోను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో అఖుంద్జాదా మతపరమైన బోధనలు మాత్రమే చేస్తున్నాడు. అయితే తాలిబన్ నాయకత్వానికి అల్లా దీవెనలు ఉండాలని చెబుతున్నాడు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేసిన పోరాటంలో మరణించిన తాలిబన్ల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశాడు. 2016 అమెరికా డ్రోన్ దాడుల్లో అప్పటి తాలిబన్ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్ హతం అయ్యాక అఖుంద్జాదా తాలిబన్లకు చీఫ్ అయ్యాడు. (చదవండి: ఫిజిక్స్‌లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు) -
మత గురువు నుంచి తాలిబన్ చీఫ్‌గా..
కాబూల్: ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా.. కల్లోలిత అఫ్గానిస్తాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇస్లాంపై అచంచల విశ్వాసం, షరియా చట్టంపై అపారమైన పరిజ్ఞానమే ఆయనకు అత్యున్నత పదవి దక్కేలా చేసిందని చెప్పొచ్చు. 60 సంవత్సరాల అఖుంద్జాదా అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ప్రాంతంలో జన్మించారు. పషూ్తన్లలోని నూర్జాయ్ అనే బలమైన తెగకు చెందిన ఆయన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కచ్లాక్ మసీదులో 15 ఏళ్లపాటు మత గురువుగా పనిచేశారు. అనంతరం తాలిబన్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. తాలిబన్ల అత్యున్నత మత గురువుగా ఎదిగారు. 1990వ దశకంలో తాలిబన్లలో చేరిన అఖుంద్జాదాకు 1995లో తొలిసారిగా పెద్ద గుర్తింపు లభించింది. 2016లో తాలిబన్ పగ్గాలు అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక కాందహార్‌లోని తాలిబన్ మిలటరీ కోర్టులో అఖుంద్జాదాకు కీలక స్థానం దక్కింది. తర్వాత నాంగార్హర్ ప్రావిన్స్‌లో మిలటరీ కోర్టు అధినేతగా పదోన్నతి పొందారు. 2001లో అమెరికా సైన్యం దండెత్తడంతో అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనకు తెరపడింది. అప్పుడు తాలిబన్ సుప్రీంకోర్టు డిప్యూటీ చీఫ్‌గా అఖుంద్జాదా అవతరించారు. మత గురువుల మండలికి పెద్ద దిక్కుగా మారారు. 2015లో తాలిబన్ అధినేత ముల్లా మన్సూర్ తన తదుపరి నాయకుడిగా (వారసుడు) అఖుంద్జాదా పేరును ప్రకటించారు. 2016లో తాలిబన్ అధినేతగా అఖుంద్జాదా పగ్గాలు చేపట్టారు. 2017లో ఆయన పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. అఖుంద్జాదా కుమారుడు అబ్దుర్ రెహమాన్ అలియాస్ హఫీజ్ ఖలీద్(23) అప్పటికే తాలిబన్ ఆత్మాహుతి దళంలో సభ్యుడిగా పని చేసేవాడు. ఓ ఉగ్రవాద దాడిలో ఖలీద్ మరణించాడు. కనిపించడం అత్యంత అరుదు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తరహాలోనే అఖుంద్జాదా కూడా గోప్యత పాటిస్తుంటారు. అత్యంత అరుదుగా జనం ముందుకు వస్తుంటారు. తాలిబన్లు అఖుంద్జాదా ఫొటోను ఇప్పటిదాకా కేవలం ఒక్కటే విడుదల చేశారు. బహిరంగంగా కనిపించకపోయినా, మాట్లాడకపోయినా తాలిబన్లకు ఆయన మాటే శిలాశాసనం. అఖుంద్జాదా ప్రస్తుతం కాందహార్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌గా అఫ్గానిస్తాన్ ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
Afghanistan Crisis: అఫ్గాన్ సుప్రీం లీడర్‌గా అఖుంద్జాదా
పెషావర్/కాబూల్: అఫ్గానిస్తాన్‌ను అక్రమించిన రెండు వారాల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దేశ అత్యున్నత నాయకుడిగా(సుప్రీం లీడర్) తాలిబన్ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా(60)ను ఎంపిక చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. ఈ విషయాన్ని తాలిబన్ సమాచార, సాంస్కృతిక కమిషన్ సీనియర్ ప్రతినిధి ముఫ్తీ ఇనాముల్లా సమాంఘనీ స్వయంగా వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వ అధినేత అఖుంద్జాదా అవుతారని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావే లేదని తేల్చిచెప్పారు. నూతన సర్కారు ఏర్పాటుపై సంప్రదింపులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మంత్రివర్గం(కేబినెట్) కూర్పుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రావిన్స్‌లకు గవర్నర్లు, జిల్లాలకు జిల్లా గవర్నర్లు ఇన్చార్జులుగా ఉంటారని తెలిపారు. అక్కడ పరిపాలన వారి నేతృత్వంలో కొనసాగుతుందని అన్నారు. ప్రావిన్స్‌లు, జిల్లాలకు గవర్నర్లను, పోలీసు చీఫ్‌లను, పోలీసు కమాండర్లను తాలిబన్లు ఇప్పటికే నియమించినట్లు సమాచారం. నూతన ప్రభుత్వ వ్యవస్థ పేరును, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఇంకా ఖరారు చేయలేదని ఇనాముల్లా వివరించారు. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం అఫ్గాన్ కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మహిళలకు, అన్ని గిరిజన తెగల సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు ఖతార్ రాజధాని దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ ఉప నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ గురువారం ప్రకటించారు. దేశంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కుతుందని అన్నారు. తాలిబన్లకు గట్టి పట్టున్న కాందహార్ నగరం నుంచే ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా ప్రభుత్వ అధినేతగా దేశ పరిపాలనను పర్యవేక్షిస్తారని తెలిపారు. భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో తాము సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నామని వివరించారు. సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేసుకొనే దిశగా ఆయా దేశాలతో తాలిబన్ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి దాదాపు 30 మిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యాక నిర్దేశిత ప్రయాణ ధ్రువపత్రాలు ఉన్నవాళ్లు విదేశాలకు వెళ్లొచ్చని సూచించారు. సుప్రీం లీడర్‌దే పెత్తనం అఫ్గానిస్తాన్‌లో ఇరాన్ తరహా ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తాలిబన్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఇరాన్లో సుప్రీం లీడర్‌దే పెత్తనం. దేశంలో ఇదే అత్యున్నత రాజకీయ, మతపరమైన, సైనికపరమైన పదవి. అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. సైనిక, ప్రభుత్వ, న్యాయ విభాగం అధినేతల నియామకంలో సుప్రీం లీడర్ మాటే చెల్లుబాటు అవుతుంది. అఫ్గానిస్తాన్‌లో సుప్రీం లీడర్ కింద అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రిని నియమించనున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌కు లోబడి అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. -
అమెరికా సైన్యానికి అతడు టార్గెట్!
వాషింగ్టన్: తాలిబాన్ నూతన చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన ముల్లా హైబతుల్లా అకుంద్జాదాకు శాంతి చర్చలలో పాల్గొనడానికి అవకాశం ఉందని అమెరికా తెలిపింది. ఇటీవల పాకిస్తాన్లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మృతి చెందిన ముల్లా మన్సూర్ స్థానంలో హైబతుల్లా అకుంద్‌జాదా తాలిబాన్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శాంతి చర్చలలో పాల్గొనడానికి కల్పించినటువంటి అవకాశాన్ని హైబతుల్లా అకుంద్‌జాదా వినియోగించుకుంటాడని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ డిప్యూటీ స్పోక్ పర్సన్ మార్క్ టోనర్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. హైబతుల్లా ఇప్పటి వరకు ఎలాంటి ఉగ్రవాద జాబితాలో లేడని.. అయితే శాంతి చర్చలలో పాల్గొనకుండా తాలిబాన్ ల హింసాత్మక పంథాను కొనసాగిస్తే మాత్రం ఆఫ్గనిస్తాన్‌లోని అమెరికా సైన్యానికి అతడు టార్గెట్ అవుతాడని ఈ సందర్భంగా టోనర్ వెల్లడించారు. పరస్పరం చర్చల ద్వారా సమస్యకు ఒక పరిష్కారం కనుగొనే అవకాశాన్ని అతనికి కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని హైబతుల్లా వినియోగించుకోవాలని టోనర్ సూచించాడు. ఆఫ్గన్ ప్రభుత్వం గతంలో తాలిబాన్లను శాంతి చర్చలకు పిలిచినా.. వారు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.