‘ఇప్పుడు పోటీచేస్తే 2019లోనూ టికెట్’
ఆకివీడు: ఈ ఎన్నికల్లో పోటీచేసిన వారికే 2019 ఎన్నికల్లోనూ టికెట్లు కేటాయించాలని అధిష్టానాన్ని కోరామని, ఆ భరోసాతోనే ప్రస్తుతం కార్యకర్తలు సూచించిన వారికి టికెట్లు కేటాయించనున్నట్టు ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరు బాపిరాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అయిభీమవరంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
పార్టీ అధిష్టానం ఆదేశంతో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీచేయనున్నట్టు చెప్పారు. తను పోటీ చేయడంతో పాటు జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత చేపట్టాలని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తనను కోరారని అన్నారు. అయితే, నర్సాపురం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల బాధ్యత తీసుకుంటానని, మిగిలినవాటిలో డీసీసీ అధ్యక్షుడికి సహకరిస్తానని చెప్పినట్టు తెలిపారు.
ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఇప్పుడు పోటీచేసిన వారికే 2019లో కూడా టికె ట్ ఇవ్వాలని తాను బొత్స సత్యనారాయణతో చెప్పానన్నారు. రాష్ట్ర విభజన తనకు ఎంతో మనస్తాపం కలిగించిందని, అయితే 2009 ఎన్నికల్లోనే తమ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొందన్నారు. విభజన విషయం కొత్తగా చూపిస్తూ పార్టీని నిందించడం సరికాదన్నారు. తాను జీవిత కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు.