ఆ సినిమా చూసి ప్రతి భారతీయుడు గర్విస్తాడు!
ముంబై: యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్'. 1990లో కువైట్‌పై ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ దండయాత్ర జరిపినప్పుడు.. భారత్ విరోచితంగా వ్యవహరించి.. అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమందిని తరలించింది. ప్రపంచంలోనే శరణార్థుల అతిపెద్ద వైమానిక తరలింపు ఇదేనని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది. ఆనాటి విరోచిత ఘట్టాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలని అక్షయ్‌కుమార్ కోరారు. ఆ ఘటనను వెలుగులోకి తీసుకురావడానికే 'ఎయిర్‌లిఫ్ట్' చిత్రంలో తాను నటించినట్టు ఆయన తెలిపారు.
'గిన్నిస్ బుక్‌ను తెచ్చుకొని అందులో అతిపెద్ద వైమానిక తరలింపు ఏదని చూస్తే భారతే కనిపిస్తుంది. దీనిని అందరి దృష్టికి తీసుకురావాలనే దృష్టితోనే ఈ కథను నేను ఎంచుకున్నాను' అని ఆయన చెప్పారు. ఎన్ఎంఐఎంఎస్ కాలేజీ వాయు ఫెస్టివల్లో ఆయన సోమవారం మాట్లాడారు.
'ఇది మన పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన పెద్ద అధ్యాయం. కీలకమైన అధ్యాయం. దీనిని చేర్చాల్సిందిగా నేను ఇప్పటికే కోరాను. షాజహన్, అక్బర్ ఏం చేశారో మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేశామో కూడా తెలుసుకోవాలి' అని ఆయన అన్నారు. '1990లో కువైట్‌పై సద్దాం హుస్సేన్ దాడి చేశాడు. దీంతో అక్కడున్న 1.70 లక్షలమంది భారతీయులు చిక్కుకుపోయారు. ఎక్కడికి పోవాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం జరిగిందన్నదే మేం ఈ కథలో చూపించబోతున్నాం. ఇలాంటి ఘటనలు మరుగన ఉంచడంలో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి' అని ఆయన పేర్కొన్నారు. 1.70 లక్షలమంది శరణార్థులను 488 విమానాల్లో 59 రోజులపాటు ఎలా సురక్షితంగా తరలించారనే విషయాన్ని వారి సహాయకుడిగా అక్షయ్ వివరించడం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించేలా ఉండే ప్రత్యేకమైన సినిమా అని, అందరూ దీనిని చూడాలని ఆయన కోరారు.