అడ్డదారిలో ఆసరా
⇒ అనర్హుల జేబుల్లోకి పింఛన్ డబ్బులు
⇒జిల్లాలో పదివేల మంది ఉన్నట్టు అంచనా!
⇒వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
⇒రంగంలోకి దిగిన అధికారయంత్రాంగం
ఏరివేతకూ దొరకని అక్రమార్కులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛన్ల పథకం(ఆసరా)లోకి అనర్హులు చొరబడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కి పింఛన్లు దక్కించుకున్నారు. దశలవారీగా ఏరివేతచేపట్టినా.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, అధికారుల పొరపాట్ల కారణంగా లక్షల రూపాయ లు పక్కదారి పట్టినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అక్రమాలను తేల్చేందుకు రంగంలోకి దిగింది. ఒకవైపు అర్హత ఉండి పింఛన్లు రాని వారి దరఖాస్తులను పరిశీలిస్తూనే.. మరోవైపు పింఛన్లు పొందిన వారి వివరాలతో ఉన్న అక్విటెన్సీలను తనిఖీచేసి అనర్హుల పేర్లను తొలగించేందుకు ఉపక్రమించింది.
పది వేలకు పైమాటే..
గతంలో కంటే పింఛన్లను ఐదురెట్లు పెంచేస్తూ ప్రభుత్వం పంపిణీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,41,081 మందిని అర్హులుగా గుర్తించి ఇప్పటివరకు 2,14,116 మందికి రూ. 44.97కోట్లు పంపిణీ చేశారు. గతంలో ఇచ్చిన మొత్తం కంటే ఐదురెట్లు అదనంగా ఇవ్వడంతో అక్రమార్కులు ఈ డబ్బులపై కన్నేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులను మాయచేసి జాబి తాలో పేరు వచ్చేలా చూసుకుని లక్షాధికారులైన పలువురు పింఛన్లు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉదంతాలపై యంత్రాం గానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అనర్హులను పట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయి లో రంగంలోకి దిగారు. ప్రస్తుతం జిల్లాలో పింఛన్లు పొందినవారిలో దాదాపు పదివేల మంది అనర్హులున్నట్లు అంచనా.
సాఫ్ట్‌వేర్‌లో ఏరివేత..
ప్రస్తుతం పింఛన్లు పంపిణీచేసిన వారి వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు(ఆక్విటెన్సీలు)వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలి. అయితే పింఛన్ల పంపిణీ ఇప్పుడిప్పుడే పూర్తికావడం తో.. ఒకట్రెండు రోజుల్లో ఈ ఆక్విటెన్సీలు డీఆర్డీఏకు చేరతాయి. ఈ వివరాలు సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తంచేసే క్రమంలో అనర్హులుగా తేలితే వారి పేర్లు తొల గించనున్నట్లు డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చేనెల నుంచి అనర్హులకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.