నేడు మిలాదున్ నబీ
- ఉదయం 8.30 గంటలకు లతీఫ్‌లౌబాలి దర్గా నుంచి భారీ ర్యాలీ
- 10.30 గంటలకు రాజ్‌విహార్ వద్ద మిలాదున్నబీ జులూస్
కర్నూలు(రాజ్‌విహార్): మహమ్మద్ ప్రవక్త (స.అ.వ) జన్మదినం సందర్భంగా నిర్వహించే పండుగ మిలాదున్ నబీ. ఈయన పుట్టకకు 50 రోజుల ముందు దుష్ట శక్తులు ఆయన తల్లి అమినాపై దాడి చేసేందుకు యత్నించగా అల్లాహ్ అనుగ్రహంతో ఆ దుష్ట శక్తులు నాశనం అయ్యాయని మౌలానా జాకీర్ తెలిపారు. ఈ ఘటన జరిగిన 50 రోజులకు ఇస్లామిక్ క్యాలెండరులోని రబ్బీవుల్ అవ్వల్ మాసంలో 12వ తేదీన ప్రవక్త జన్మించారని పేర్కొన్నారు. తర్వాత ఈయన ఇస్లాం మత వ్యాప్తితోపాటు అల్లాహ్ ఒకే దైవం అని, ఆయనకు సాటెవ్వరు లేరని బోధనలు చేశారు. కలిమా చదివి ఇమాన్ తీసుకున్న ప్రతి వ్యక్తి రోజుకు ఐదు పూటలా నమాజ్ చదవాలని, ప్రతి ఏటా రంజాన్ మాసంలో పవిత రోజాలు (ఉపవాసాలు) పాటించాలని, పేదలకు జకాత్ పేరుతో దానధర్మాలు చేయాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లి రావాలని సూచించారు ప్రవక్త. దీంతో ప్రతీ ఏటా ఆయన జన్మదినాన్ని మిలాదున్ నబీగా ముస్లింలు పండుగ చేసుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ వేడుకలను కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించేందుకు లతీఫ్ లౌవుబాలి దర్గా పీఠాథిపతులు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు మిలాదున్ నబీ జులూస్ (ఊరేగింపు) కార్యక్రమాన్ని రాజ్విహార్సెంటర్లో నిర్వహించనున్నారు. అంతకు ముందుగానే ఉదయం 8.30 గంటలకు హజరత్ లతీఫ్ లౌబాలి దర్గా నుంచి లాల్ మసీద్ రోడ్ మీలాద్ చౌక్, రాజ్‌విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఇందులో ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టారేణుక, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఎస్పీ ఆకే రవికృష్ణ, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ పాల్గొననున్నారు.