మెరుగైన జీవనమే లక్ష్యం
సాక్షి,సిటీబ్యూరో: మెట్రోపొలిస్ సదస్సులో నగరాల్లో ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవనాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుగుతాయని మెట్రోపొలిస్ సెక్రటరీ జనరల్ అలైన్ లె సాక్స్ అన్నారు. అక్టోబర్ నెలలో నగరంలో జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు నగరానికి వచ్చిన ప్రతినిధుల బృందం సోమ, మంగళ వారాల్లో పలు ప్రాం తాలు సందర్శించింది.
ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైంది. అనంతరం జీహెచ్ఎంసీలో మెట్రోపొలిస్ ప్రతినిధులు అలైన్ లె సాక్స్, అగ్నేస్, భారత్‌కు అడ్వయిజర్, డెరైక్టర్ సునిల్దుబే, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ఎ.బాబు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సు అని, దీని కి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
నగరాల అభివృద్ధికి సంబంధించి కొత్త అధ్యాయంగా, మొదటి పేజీగా హైదరాబాద్ సదస్సు మిగలనుందన్నారు. ప్రపంచంలోని అనేక నగరాల్లో పలు సమస్యలు సవాళ్లు విసురుతున్నాయని, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా నగరాల మేయర్లు, ఇతరత్రా వర్గాల ప్రజలు పాల్గొనే ఈ సదస్సులో పరస్పర అభిప్రాయమార్పిడితో సమస్యలకు పరిష్కారం దొరుకుతుం దన్నారు. సదస్సులో స్మార్ట్‌సిటీ అంశం కూడా ప్రధానంగా ఉంటుందన్నారు. బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్‌లను ప్రతిబింబించేందుకు ఈ సదస్సు దోహదపడుతుంద న్నారు. సమకాలిన సమస్యలపై కూడా చర్చలు జరుగుతాయని చెప్పారు. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్నిఅందించేందుకు కొత్త ఆవిష్కరణలు చేసిన నగరాలకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు సదస్సుకు 566 మంది ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకోగాా, వారిలో 43 దేశాలకు చెందిన 162 మంది విదేశీ ప్రతినిధులున్నారన్నారు. మరో నెల గడువున్నందున దాదాపు 2వేల మంది హాజరుకాగలరనే ధీమా వ్యక్తం చేశారు. ఆన్లైన్ ద్వారా ఆక్టోబర్ 2 వరకు పేర్లు నమోదు చేసుకునే అవకాశముందన్నారు. పట్టణీకరణకు సంబంధించిన అంశాల్లో నిపుణులు, సాంకేతిక పరిజా ్ఞనం కలిగిన వారు తదితరులు వెరసి 73 మంది అంతర్జాతీయ నిపుణులు ఈ సదస్సులో ప్రసంగిస్తారన్నారు.
మెట్రోరైలు, గ్రీన్బిల్డింగ్, సెల్ఫ్హెల్ప్గ్రూపుల పనితీరు తదితర అంశాలపై కూడా చర్చ ఉంటుందన్నారు. ఈ సదస్సుకు సీఎం నేతృత్వంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను ఆహ్వానిస్తామన్నారు. బార్సిలోనా, సిడ్నీలను సందర్శించాల్సిందిగా తాము సీఎం కేసీఆర్‌ను కోరినట్లు మెట్రోపొలిస్ ప్రతినిధులు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీహెచ్ఎంసీ తగిన సహకారమందించాయని, ఏర్పా ట్లు బాగున్నాయని చెప్పారు. సదస్సుకు హాజరయ్యే మేయర్లకు ముఖ్యమంత్రి చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్ ఇవ్వనున్నారని స్పెషల్ కమిషనర్ బాబు చెప్పారు.