రంకేసిన.. పౌరుషం.. బుసకొట్టిన బసవన్న.. కార్తీక్‌కు కారు గిఫ్ట్
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మదురై జిల్లా అలంగానల్లూరులో బసవన్నలు బుసకొట్టాయి. జల్లికట్టులో భాగంగా రంకెలేసిన పోట్లగిత్తలను క్రీడాకారులు లొంగదీశారు. తమ వీరత్వాన్ని చాటే రీతిలో వాడివాసల్ వైపుగా దూసుకెళ్లారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఇంటిళ్లిపాది ఆనందోత్సాహలతో పెద్ద పండుగను జరుపుకున్నారు. ఇక, సోమవారం మదురై జిల్లా అలంగానల్లూరులో తమిళుల సాహస క్రీడ జల్లికట్టు ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
చదవండి: వెడ్డింగ్ రిసెప్షన్ కోసం కాబోయే జంట ప్రయత్నం.. వార్తల్లోకి!
సెలవుల్లో సరదాగా..
ఈసారి పెద్ద పండుగకు సెలవులు సాధారణం కంటే ఎక్కువగా రావడంతో ప్రజల తమ తమ స్వస్థలాలకు వెళ్లి ఆనందోత్సహాలతో గడిపారు. గురువారం భోగి, శుక్రవారం సంక్రాంతి, శనివారం గోమాతలకు పూజలతో కనుమ పండుగను జరుపుకున్నారు. ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలుతో కావడంతో ప్రపంచ ప్రసిద్దిగాంచిన అలంగానల్లూరు జల్లికట్టును సోమవారం నిర్వహించారు. తమిళుల సంప్రదాయ, సాహాస క్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టు కట్టుదిట్టమైన భద్రత, కరోనా ఆంక్షల నడుమ జరుపుకోవాల్సి వచ్చింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు..
అలంగానల్లూరు జల్లికట్టులో 700 ఎద్దులు, 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 8 రౌండ్లతో ఇక్కడ పోటీలు జరిగాయి. ఉదయం ఆరున్నర గంటలకు మునియాండి స్వామి ఆలయంలో పూజల అనంతరం వాడివాసల్ మైదానంలో మంత్రులు మూర్తి , పళని వేల్ త్యాగరాజన్, ఎమ్మెల్యే వెంకటేషన్, కలెక్టర్ అనీష్ శేఖర్ జెండా ఊపినానంతరం ఎద్దులు వాడివాసల్ నుంచి దూసుకొచ్చాయి. కరోనా కట్టుబాట్ల నడుమ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కొమ్ములు తిరిగిన బసవన్నలు బుసలు కొడుతూ రంగంలోకి దిగాయి.
ఆల్ రౌండర్‌కు కారు..
ఉదయం నుంచి నువ్వా..నేనా అన్నట్టుగా సాగిన పోటీలు సాయంత్రం ముగిశాయి. ఆల్ రౌండర్ ప్రతిభ ప్రదర్శించడమే కాకుండా 21 ఎద్దుల్ని పట్టుకున్న కరుప్పాయూర్కు చెందిన కార్తీక్ అనే యువకుడికి డీఎంకే యువజన నేత ఉదయ నిధి స్టాలిన్ తరపున కారును బహుమతిగా అందజేశారు. అలాగే, ఉత్తమ ప్రదర్శన చేసిన ఎద్దు యజమాని కైకురిచ్చి తమిళ్ సెల్వన్‌కు సైతం కారు బహుకరించారు. అలాగే, 19 ఎద్దుల్ని పట్టుకున్న అలంగానల్లూరు రాం కుమార్‌కు రెండో బహుమతి, 13 ఎద్దుల్ని పట్టుకున్న చిత్తాలంకుడికి చెందిన గోపాలకృష్ణన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా, తిరుచ్చి జిల్లా పులియం పాడిలో అనుమతి లేకుండా జరిగిన జల్లికట్టును పోలీసులు అడ్డుకున్నారు గ్రామస్తులు రాళ్ల దాడి చేయడంతో ఎస్ఐ ఇలంగోవన్‌తో సహా మరో ఇద్దరు గాయపడ్డారు. అలాగే, పుదుకోట్టైలో అధికారుల అనుమతితో జల్లికట్టు ప్రశాంత వాతావరణంలో జరిగింది. అలాగే, సేలం ఆత్తూరులోనూ జల్లికట్టు హోరాహోరీగా సాగింది. కాగా, పండుగ నిమిత్తం స్వస్థలాలకు వెళ్లిన జనం చెన్నై వైపుగా తిరుగు పయనం అయ్యారు. దీంతో చెన్నై శివారు మార్గాల్లో వాహనాలు కిలో మీటర్లకొద్దీ బారులుదీరాయి.
భారీగా బహుమతులు
ఒక్కో రౌండ్‌కు సీఎం స్టాలిన్ చిత్రంతో కూడిన పలు వర్ణాలతో కూడిన డ్రెస్ కోడ్ నెంబర్లతో దూసుకొచ్చిన క్రీడాకారులు ఎద్దుల పొగరును అణచి వేస్తూ.. తమ పౌరుషాన్ని చాటుకున్నారు. గెలిచిన క్రీడాకారులకు సీఎం స్టాలిన్ తరపున బంగారు నాణెలు, ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బంగార ఉంగరాలను అందజేశారు. అలాగే, పాల్గొన్న అన్ని ఎద్దుల యజమానులకు బంగారు నాణెం అందజేశారు. ఇక, సెల్ఫోన్లు, బిందెలు, వాషింగ్ మిషన్లు, బీరువాలు, మంచాలు, ఎల్ఈడీ టీవీలు, ఏసీలు, ఫ్యాన్లు, సైకిళ్లు, స్టీలు, వెండి పాత్రలు వంటి ఆకర్షణీయమైన బహుమతుల్ని విజేతలకు నిర్వాహకులు అందజేశారు. అయితే, ఈ పర్యాయం కూడా ఎక్కువగా క్రీడాకారులతో పాటుగా బసవన్నలు బహుమతుల్ని తన్నుకెళ్లాయి. కాగా, క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా 80 ఏళ్ల వృద్ధురాలు సుందరమ్మాల్ నృత్యం చేస్తూ ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.