సాక్షి, చెన్నై: సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడ జోరుగా సాగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తమిళులు జల్లికట్టును జోరుగా నిర్వహించారు. జల్లికట్టు ఎద్దులు హింసకు గురి అవుతున్నాయని జంతుప్రేమికులు గగ్గోలు పెట్టడంతో గతంలో సుప్రీంకోర్టు ఈ క్రీడపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఆంక్షలులేని వాతావరణం ఉండటంతో తమిళులు రెట్టించిన ఉత్సాహంతో జల్లికట్టు ఆటలో పాల్గొన్నారు. కోడెద్దులను మైదానంలోకి వదిలి.. వాటిని అదుపుచేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటనల్లో పలుచోట్ల హింస కూడా చోటుచేసుకుంది.
పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం
మదురై జిల్లాలోని అలంగనల్లూరులో మంగళవారం జరిగిన జల్లికట్టు క్రీడలో సీఎం ఎడపాటి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. జల్లికట్టు కోసం ముస్తాబు చేసిన ఎద్దులకు మొక్కి వారు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ అట్టహాసంగా జరిగిన జల్లికట్టు క్రీడకు పోలీసులు భారీ భద్రత కల్పించారు.
అపశృతి..
తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. మధురై జిల్లా పలమేడులో నిర్వహిస్తున్న జల్లికట్టు వినోదం చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని బుల్ కలెక్షన్ పాయింట్ వద్ద ఎద్దు పొడిచింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని దిండిగల్ జిల్లాకు చెందిన కాలిముత్తు(19)గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment