ఒబామా మమ్మల్ని ఆటపట్టించారు!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ మహిళను, ఆమె భర్తను సరదాగా ఆటపట్టించారు. ఈ విషయాన్ని ఆ మహిళ స్వయంగా మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. గత సోమవారం అలస్కాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి జోలెన్ జాకిన్స్కీ తన భర్త, ఆరు నెలల పాపతో వచ్చింది. భర్త ఏదో పనిమీద కాస్త పక్కకు వెళ్లగా.. నెలల బుజ్జాయిని తల్లి జోలెన్ ఆడిస్తోంది. ఇంతలో సాధారణంగా ఉన్న ఓ వ్యక్తిని ఆమె చూసి ఒబామా అనుకుని పొరపడ్డట్లుగా భావించారు. దగ్గరకెళ్లి చూస్తే ఆశ్చర్యం.. ఆ సాధారణ వ్యక్తి మరెవరో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే.
పాపతో పాటే ఒబాబా వద్దకు నేను చేరుకోగానే ఆయన చిరునవ్వుతో పలకరించారు. ఈ అందమైన బుజ్జాయి ఎవరు అని అడిగారు. మా పాప అని చెప్పిన తర్వాత.. చిన్నారి గిసెల్లేను ఒబామా ఎత్తుకుని ముద్దుచేశారు. ఆ సంతోషంలో నేను ఒబాబాతో సెల్ఫీలు తీసుకున్నాను. గిసెల్లే తండ్రి అక్కడికి రాగానే.. 'మీ పాప అందంగా ఉంది. చిన్నారిని నాతోపాటు తీసుకెళ్తాను. మీకు ఏం ఇబ్బందిలేదు కదా' అంటూ జోక్ చేసి ఒబామా ఆ దంపతులను సరదాగా ఆటపట్టించారు. నిజంగానే తమ పాపను అడిగారేమోనని తన భర్త భావించాడని జోలెన్ తెలిపారు. ఒబామా లాంటి గొప్పవ్యక్తిని కలుసుకుని ఆయనతో ఫొటోలు దిగడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని, కొందరికి మాత్రమే ఈ చాన్స్ దొరుకుతుందని జోలెన్ జాకిన్స్కీ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటొలోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్గా మారాయి.