టైగర్ నరేంద్ర ఇక లేరు
* అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీజేపీ నేత
* జన్‌సంఘ్, బీజేపీ బలోపేతానికి విశేష కృషి.. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా సేవలు
* ఆలె నరేంద్ర మృతికి జగన్ సహా పలువురు ప్రముఖుల సంతాపం
హైదరాబాద్, న్యూస్‌లైన్: టైగర్ నరేంద్రగా సుపరిచితులైన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆలె నరేంద్ర (68) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇక్కడి మోజాంజహి మార్కెట్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 4.15 గంటలకు మృతి చెందారు. నరేంద్ర పార్థివదేహాన్ని గౌలిపురాలోని ఆయన గృహానికి తరలించారు.
పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నరేంద్రకు భార్య లలిత, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు భాస్కర్ రాజ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. బీజేవైఎం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడైన రెండో కుమారుడు జితేంద్ర గౌలిపురా డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
పాతబస్తీ గౌలిపురాలో ఆలె రామలింగం, పుష్పవతి దంపతులకు 1946 ఆగస్టు 21న నరేంద్ర జన్మించారు. నగరంలో జన్‌సంఘ్, బీజేపీ బలోపేతానికి కృషిచేశారు. 17 ఏళ్ల వయసులోనే జన్‌సంఘ్‌లో చేరి, కార్య నిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. 1980లో బీజేపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి రాష్ట్ర కార్యదర్శిగా, కోశాధికారిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 1980లో హైదరాబాద్ నుంచి, 1983లో చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
1983లో జరిగిన ఉప ఎన్నికల్లో హిమాయత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 1985లో కూడా హిమాయత్‌నగర్ నుంచి గెలుపొందారు. 1989లో ఓటమి పాలైన ఆయన 1992 ఉప ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో మెదక్ లోక్‌సభ స్థానంలో ఓడిపోయి, 1999లో అదే స్థానంలో 26 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోవడంతో 2001లో పార్టీని వీడి తెలంగాణ సాధన సమితిని స్థాపించారు. 2002లో దానిని టీఆర్ఎస్లో విలీనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 1,25,000 భారీ మెజార్టీతో గెలుపొందారు.
యూపీఏ ప్రభుత్వంలో 2004 మేలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.. 2006 ఆగస్టు 24 వరకు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగిన ఆయన కాంగ్రెస్‌తో విభేదించి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2011లో తిరిగి బీజేపీలో చేరారు. 1980లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఐడీపీఎల్, ఆల్విన్ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు.
మహోన్నతుడు నరేంద్ర : దత్తాత్రేయ
నరేంద్ర మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గౌలిపురాలోని నరేంద్ర నివాసానికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భాగ్యనగరంలో బీజేపీకి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి నరేంద్ర అని, ఆయన మరణం దేశానికి తీరని లోటని దత్తాత్రేయ అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించారని కొనియాడారు. నరేంద్ర మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు.
నరేంద్ర మృతికి జగన్ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో పోరాటపటిమ కలిగిన ఒక నేతను రాష్ట్రం కోల్పోయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికోద్యమ నేతగా కార్మికుల సంక్షేమానికి పాటుపడ్డారని, ఎమ్మెల్యే, ఎంపీగా ప్రజా సేవ చేశారని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. నరేంద్ర కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.