Alexander Akosta Senate Committee
-
హెచ్1బీ దరఖాస్తు రుసుం పెంపు!
వాషింగ్టన్: నైపుణ్య ఉద్యోగాలు చేసేవారికి తాము మంజూరుచేసే హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుంను పెంచాలని అమెరికా యోచిస్తోంది. తమ దేశంలో అప్రెంటిస్ ప్రోగ్రాంను విస్తరించేందుకు రుసుం పెంచాలని భావిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు. రుసుం పెంచితే భారతీయ ఐటీ కంపెనీలపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. మంగళవారం అమెరికా కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అప్రెంటిస్ కార్యక్రమాన్ని దుర్వినియోగపరిచే వారి నుంచి అమెరికా కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇప్పటికే హెచ్–1బీ వీసా దరఖాస్తులో మార్పులు చేశామని, దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని అకోస్టా వివరించారు. అయితే దరఖాస్తు రుసుం ఎంత పెంచుతారో, ఏఏ కేటగిరీ దరఖాస్తుల్లో ఎంత పెంచుతారనే విషయాలు వెల్లడించలేదు. ‘2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కార్మిక శాఖకు 160 మిలియన్ డాలర్లు కేటాయిస్తాం. అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంను విస్తరిస్తాం. ఇందుకోసం హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుం పెంచి అధిక రెవెన్యూ రాబడతాం’ అని వివరించారు. అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ద్వారా అమెరికా యువతకు సాంకేతికపరమైన అంశాల్లో శిక్షణ అందిస్తారు. కాగా, గతేడాది హెచ్–1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి వీసా ఇచ్చేందుకు ఇమిగ్రేషన్ అధికారులు నిరాకరించినట్లు సీటెల్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే ఏటా దాదాపు లక్ష మంది విదేశీ ఉద్యోగులు హెచ్–1బీ వీసా ద్వారా అమెరికాకు వస్తున్నారని, వారిని ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తున్నారని బ్రిట్బార్ట్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. ఏ సమయంలో చూసినా అమెరికాలో హెచ్–1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులు దాదాపు 6.5 లక్షల మంది ఉంటున్నారని వివరించింది. -
‘హెచ్–1బీ’ వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచండి
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల మీద అమెరికాకు పనిచేయడానికి వచ్చే ఉద్యోగుల కనీస వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచాలని ఆ దేశ కార్మిక మంత్రి అలెగ్జాండర్ అకోస్టా సెనేట్ కమిటీకి విన్నవించారు. ప్రస్తుతం వారి కనీస వేతనం 60 వేల డాలర్లు కాగా, ఇది చాలా కాలం క్రితం నిర్ణయించిన పరిమితి అనీ, ఇప్పుడు సవరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుడే అమెరికన్ల నిరుద్యోగ సమస్యకు కొంతవరకు పరిష్కారం చూపడానికి వీలవుతుందని అన్నారు. హెచ్–1బీ కింద ఇచ్చే సగానికిపైగా వీసాలు భారత్లోని రెండు ఔట్సోర్సింగ్ కంపెనీలకే వెళ్తున్నాయని సెనేటర్ రిచర్డ్ డర్బిన్ పేర్కొన్నారు. ఇటీవల షికాగోలోని ఓ ఔషధ కంపెనీ ఏళ్ల తరబడి పనిచేస్తున్న 150 మంది అమెరికా జాతీయులను ఉద్యోగాల్లోం చి తీసేసి భారత ఐటీ నిపుణులను నియమించుకుందని డర్బిన్ కమిటీకి చెప్పారు. సన్నిహితులుంటేనే అమెరికా వీసా ఆరు ముస్లిం ప్రధాన దేశాల పౌరులు అమెరికా వీసాకు దరఖాస్తుచేసుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. గురువారం నుంచే ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. వీసా కోరే అన్ని దేశాల శరణార్థులు, ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలోని వ్యక్తులు లేదా సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలని వాటిలో పేర్కొన్నారు. ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ల నుంచి వచ్చే వారికి అమెరికాలో తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, కోడలు, అల్లుడు, తోబుట్టువు ఇలా ఎవరో ఒకరు సన్నిహితమైన సంబంధమున్న వారు ఉండాలి.