‘హెచ్‌–1బీ’ వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచండి | US labour secretary calls for increasing salary of H1B visa holders | Sakshi
Sakshi News home page

‘హెచ్‌–1బీ’ వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచండి

Published Fri, Jun 30 2017 1:23 AM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM

‘హెచ్‌–1బీ’ వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచండి - Sakshi

‘హెచ్‌–1బీ’ వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచండి

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాల మీద అమెరికాకు పనిచేయడానికి వచ్చే ఉద్యోగుల కనీస వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచాలని ఆ దేశ కార్మిక మంత్రి అలెగ్జాండర్‌ అకోస్టా సెనేట్‌ కమిటీకి విన్నవించారు. ప్రస్తుతం వారి కనీస వేతనం 60 వేల డాలర్లు కాగా, ఇది చాలా కాలం క్రితం నిర్ణయించిన పరిమితి అనీ, ఇప్పుడు సవరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అప్పుడే అమెరికన్ల నిరుద్యోగ సమస్యకు కొంతవరకు పరిష్కారం చూపడానికి వీలవుతుందని అన్నారు. హెచ్‌–1బీ కింద ఇచ్చే సగానికిపైగా వీసాలు భారత్‌లోని రెండు ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలకే వెళ్తున్నాయని సెనేటర్‌ రిచర్డ్‌ డర్బిన్‌ పేర్కొన్నారు. ఇటీవల షికాగోలోని ఓ ఔషధ కంపెనీ ఏళ్ల తరబడి పనిచేస్తున్న 150 మంది అమెరికా జాతీయులను ఉద్యోగాల్లోం చి తీసేసి భారత ఐటీ నిపుణులను నియమించుకుందని డర్బిన్‌ కమిటీకి చెప్పారు.

సన్నిహితులుంటేనే అమెరికా వీసా
ఆరు ముస్లిం ప్రధాన దేశాల పౌరులు అమెరికా వీసాకు దరఖాస్తుచేసుకోవడానికి ట్రంప్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. గురువారం నుంచే ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. వీసా కోరే అన్ని దేశాల శరణార్థులు, ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలోని వ్యక్తులు లేదా సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలని వాటిలో పేర్కొన్నారు. ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్‌ల నుంచి వచ్చే వారికి అమెరికాలో తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, కోడలు, అల్లుడు, తోబుట్టువు ఇలా ఎవరో ఒకరు సన్నిహితమైన సంబంధమున్న వారు ఉండాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement