వాషింగ్టన్: నైపుణ్య ఉద్యోగాలు చేసేవారికి తాము మంజూరుచేసే హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుంను పెంచాలని అమెరికా యోచిస్తోంది. తమ దేశంలో అప్రెంటిస్ ప్రోగ్రాంను విస్తరించేందుకు రుసుం పెంచాలని భావిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు. రుసుం పెంచితే భారతీయ ఐటీ కంపెనీలపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. మంగళవారం అమెరికా కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అప్రెంటిస్ కార్యక్రమాన్ని దుర్వినియోగపరిచే వారి నుంచి అమెరికా కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇప్పటికే హెచ్–1బీ వీసా దరఖాస్తులో మార్పులు చేశామని, దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని అకోస్టా వివరించారు. అయితే దరఖాస్తు రుసుం ఎంత పెంచుతారో, ఏఏ కేటగిరీ దరఖాస్తుల్లో ఎంత పెంచుతారనే విషయాలు వెల్లడించలేదు.
‘2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కార్మిక శాఖకు 160 మిలియన్ డాలర్లు కేటాయిస్తాం. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాంను విస్తరిస్తాం. ఇందుకోసం హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుం పెంచి అధిక రెవెన్యూ రాబడతాం’ అని వివరించారు. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం ద్వారా అమెరికా యువతకు సాంకేతికపరమైన అంశాల్లో శిక్షణ అందిస్తారు. కాగా, గతేడాది హెచ్–1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి వీసా ఇచ్చేందుకు ఇమిగ్రేషన్ అధికారులు నిరాకరించినట్లు సీటెల్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే ఏటా దాదాపు లక్ష మంది విదేశీ ఉద్యోగులు హెచ్–1బీ వీసా ద్వారా అమెరికాకు వస్తున్నారని, వారిని ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తున్నారని బ్రిట్‌బార్ట్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. ఏ సమయంలో చూసినా అమెరికాలో హెచ్–1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులు దాదాపు 6.5 లక్షల మంది ఉంటున్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment