రౌడీషీటర్‌పై పోలీసు కాల్పులు
నిఘా పెట్టి వేటాడి...
నిందితుడిపై 45 కేసులు
బెంగళూరు : పోలీసు కాల్పుల్లో రౌడీషీటర్ గాయపడిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వెంకటేశ్ అలియాస్ వెంకి అలియాస్ కంచె (29)ను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించినట్లు మంగళవారం డీసీపీ సందీప్ పాటిల్ చెప్పారు. వెంకటేష్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కృష్ణమూర్తిని ఆస్పత్రికి తరలించారు. ఆయన వివరాల మేరకు వారం రోజుల క్రితం ఓ యువతి కిడ్నాప్‌నకు యత్నించాడని రౌడీషీటర్ వెంకటేష్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి క్లబ్లో పార్టీ ముగించుకుని అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో వెంకటేష్ బైక్‌లో బయటకు వచ్చాడు. అదే సమయంలో అశోక్‌నగర సీఐ రంగప్ప, కానిస్టేబుల్ కృష్ణమూర్తి ఇతర సిబ్బం ది జీపులో వెంబడించారు.
బైక్ నిలపాలని సూచించారు. అయితే వెంకటేష్ వేగంగా బండి నడపడంతో పోలీసులు కూడా అదే వేగంతో బైక్‌ను ఢీకొట్టి వెంకటేష్‌ను కిందపడేటట్లు చేశారు. ఇదే సమయంలో వెంకటేష్ తన వద్ద పదునైనా ఆయుధంతో కానిస్టేబుల్ కృష్ణమూర్తిని గాయపరిచాడు. దీంతో అప్రమత్తమైన సీఐ రివాల్వర్‌తో వెంకిపై కాల్పులు జరిపాడు. దీంతో అతను కుప్పకూలిపోయాడు.
అప్పటి నుంచి నిఘా
వారం రోజుల క్రితం బీబీఎంపీ కార్పొరేటర్ గోవిందగౌడ మనవుడి పుట్టిన రోజు వేడుకలు ఇక్కడి శివానంద సర్కిల్లోని హోటల్లో నిర్వహించారు. అదే రోజు రాత్రి 9.45 గంటల సమయంలో వేడుక ముగించుకుని గోవిందగౌడ కోడలు మానస భర్తతో కలిసి బయటకు వచ్చారు. భర్త కారు తీసుకుని రావడానికి వెళ్లిన సమయంలో ఆమె రోడ్డుపై ఉండగా ఇండికా కారులో వచ్చిన వెంకటేష్, మరో ముగ్గురు మానసతో గొడవ పెట్టుకున్నారు.
ఆమెను కిడ్నాప్ చెయ్యడానికి విఫలయత్నం చేశారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద పెట్టున కేకలు పెట్టడంతో సిగ్నల్ వద్ద ఉన్న పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఆ సమయంలో వెంకటేశ్, మరో నిందితుడు పరారీ కాగా మంజునాథ్ అనే వ్యక్తిని మానస కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. పోలీసులు నిందితులు వచ్చిన కారును గుర్తించి విచారణ చేసి అప్పటి నుంచి వెంకటేష్‌పై నిఘా పెట్టారు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 45 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.