Alice
-
WPL 2024: ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాదీ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ఆదివారం ఆఖరి బంతిదాకా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకిది ఐదో విజయం. మొదట ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), షఫాలీ వర్మ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) 54 పరుగులతో శుభారంభమిచ్చారు. తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. మూడో వికెట్‌కు ఇద్దరు కలిసి 61 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. జెమీమా 26 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. స్పిన్నర్ శ్రేయాంక 4 వికెట్లు తీసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (5) విఫలమైనా... టాపార్డర్‌లో సోఫీ మోలినెక్స్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఎలీస్ పెరీ (32 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరును నడిపించారు. ఓవర్ వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ దశలో రిచా ఘోష్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ డివైన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మ్యాచ్‌పై ఆశలు రేపారు. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా, రిచా రెండు భారీ సిక్స్‌లు బాదింది. ఒక బంతి 2 పరుగుల విజయ సమీకరణం వద్ద రిచా రనౌట్ కావడంతో పరుగు తేడాతో ఢిల్లీ గట్టెక్కింది. నేడు గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరగా... ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న యూపీ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలి. -
ఎలక్ట్రిక్ విమానాలూ వచ్చేస్తున్నాయ్!
బైక్‌లు.. కార్లు.. బస్సులే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలూ వచ్చేస్తున్నాయి. విమానాల్లో వినియోగించే శిలాజ ఇంధన ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటం.. ఇంధన వనరుల వినియోగం సైతం పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయాలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్ సంస్థ ‘అలైస్’ పేరిట ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఆవిష్కరించింది. ప్రపంచం చూపును తన వైపునకు తిప్పేసుకుంది. 2024 నాటికి గాలిలో చక్కర్లు కొట్టేందుకు ఎలక్ట్రిక్ విమానాలు సిద్ధమవుతుండగా.. జర్మనీకి చెందిన డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ తన వాణిజ్య కార్యకలాపాల కోసం ఎలక్ట్రికల్ విమానాలు నడిపే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాకు చెందిన కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. (కె.జి.రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): విమానాల్లో ఉపయోగించే సంప్రదాయ ఇంధనం స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలు వస్తాయా అనే ప్రశ్నకు ఓ సమాధానం దొరికింది. గతంలో కార్బన్ డయాక్సైడ్ నుంచి ఇంధన తయారీ ప్రయోగాలు విజయవంతమైనప్పటికీ సంప్రదాయ ఇంధనం ధరతో పోలిస్తే.. దీని భారం రెట్టింపు అ య్యింది. దీంతో ఆ ప్రయత్నాల్ని వివిధ సంస్థలు విరమించుకున్నాయి. బయో ఇంధనాలు వినియోగంపై ఆలోచనలు చేసినా.. అవన్నీ ప్రయోగాల దశ దాటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో విమానాలను సైతం విద్యుత్‌తో నడిపించేవిధంగా ప్రయోగాలు చేసిన ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ సత్ఫలితాలు సాధించింది. ఆ సంస్థ ‘అలైస్’ పేరిట తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ గతేడాది పారిస్‌లో జరిగిన ఎయిర్‌షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. మొట్టమొదటి కమర్షియల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. దీనిని పౌర విమానయాన సేవలకూ వినియోగించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. 10 వేల అడుగుల ఎత్తులో చక్కర్లు ఇజ్రాయెల్ సంస్థ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 2018 నుంచి ఏడాది పాటు శ్రమించి దీనిని తయారు చేసింది. 2021లో ఈ విమానం గాలిలో చక్కర్లు కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దీనికి టెస్ట్ ఫ్లైట్ చేపట్టగా.. 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగన విహారం చేసింది. సాధారణ విమానం ముందుకు వెళ్లడానికి రెండు రెక్కలకు రెండు ప్రొపెల్లర్స్ ఉంటాయి. కానీ.. అలైస్‌లో మాత్రం మూడు ప్రొపెల్లర్స్ ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెంటిండినీ చెరో రెక్కకు అమర్చారు. ప్రమాదం తర్వాత.. ప్రయోగాల సమయంలో అలైస్ నమూనాలో 2020 జనవరి 22న అగ్ని ప్రమాదం సంభవించింది. పాసింజర్ ఏరియాలో ఉండే అండర్ ఫ్లోర్ బ్యాటరీ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం తర్వాత విమానం నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ ఇంటర్ కనెక్షన్ సిస్టమ్ తయారీ కోసం జీకేఎన్ ఏరోస్పేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంతో అలైస్ తయారీ విజయవంతమైంది. సీమెన్స్, మాగ్నిక్స్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ మోటార్లను అలైస్ విమానాల కోసం వినియోగిస్తున్నారు. 60 నుంచి 80 శాతం ఖర్చు ఆదా... ప్రస్తుతం వినియోగిస్తున్న సంప్రదాయ ఇంధనంతో పోలిస్తే విద్యుత్ ఆధారిత విమానం వినియోగంలో ఖర్చు చాలా తక్కువ. ‘సెస్నా కార్వాన్’ అనే ఒక చిన్న విమానం 160 కిలోమీటర్లు ప్రయాణించేందుకు దాదాపు రూ.27 వేల ఇంధనం ఖర్చవుతోంది. కానీ.. అలైస్ ఎలక్ట్రిక్ విమానంలో 160 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం రూ.8 వేల వరకు మాత్రమే ఖర్చవుతోంది. అంటే దాదాపు 60 నుంచి 80 శాతం వరకూ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. అందరి చూపూ.. అలైస్ వైపే విమానయాన రంగంలో విప్లవం సృష్టిస్తున్న అలైస్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రఖ్యాత కార్గో సంస్థ డీహెచ్ఎల్ తన సరకు రవాణా కోసం 12 విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. అదేవిధంగా అమెరికాకు చెందిన కేప్ ఎయిర్, గ్లోబర్ క్రాసింగ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం పదుల సంఖ్యలో ఆర్డర్లు బుక్ చేశాయి. 2024 నాటికి పూర్తిస్థాయిలో అలైస్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌లు గాలిలో దూసుకుపోతాయని అంచనా వేస్తున్నారు. విమానయాన రంగంలో కర్బన ఉద్గారాల నియంత్రణకు ఎయిర్‌లైన్స్ సంస్థలు అలైస్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను అలైస్ అధిగమించగలదా లేదా అనే సందేహాలూ ఉత్పన్నమవుతున్నాయి.