బైక్‌లు.. కార్లు.. బస్సులే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలూ వచ్చేస్తున్నాయి. విమానాల్లో వినియోగించే శిలాజ ఇంధన ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటం.. ఇంధన వనరుల వినియోగం సైతం పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయాలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్ సంస్థ ‘అలైస్’ పేరిట ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఆవిష్కరించింది. ప్రపంచం చూపును తన వైపునకు తిప్పేసుకుంది. 2024 నాటికి గాలిలో చక్కర్లు కొట్టేందుకు ఎలక్ట్రిక్ విమానాలు సిద్ధమవుతుండగా.. జర్మనీకి చెందిన డీహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ తన వాణిజ్య కార్యకలాపాల కోసం ఎలక్ట్రికల్ విమానాలు నడిపే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాకు చెందిన కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి.
(కె.జి.రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): విమానాల్లో ఉపయోగించే సంప్రదాయ ఇంధనం స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలు వస్తాయా అనే ప్రశ్నకు ఓ సమాధానం దొరికింది. గతంలో కార్బన్ డయాక్సైడ్ నుంచి ఇంధన తయారీ ప్రయోగాలు విజయవంతమైనప్పటికీ సంప్రదాయ ఇంధనం ధరతో పోలిస్తే.. దీని భారం రెట్టింపు అ య్యింది. దీంతో ఆ ప్రయత్నాల్ని వివిధ సంస్థలు విరమించుకున్నాయి. బయో ఇంధనాలు వినియోగంపై ఆలోచనలు చేసినా.. అవన్నీ ప్రయోగాల దశ దాటలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌లో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో విమానాలను సైతం విద్యుత్‌తో నడిపించేవిధంగా ప్రయోగాలు చేసిన ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ సత్ఫలితాలు సాధించింది. ఆ సంస్థ ‘అలైస్’ పేరిట తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ గతేడాది పారిస్‌లో జరిగిన ఎయిర్‌షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. మొట్టమొదటి కమర్షియల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. దీనిని పౌర విమానయాన సేవలకూ వినియోగించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.
10 వేల అడుగుల ఎత్తులో చక్కర్లు
ఇజ్రాయెల్ సంస్థ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 2018 నుంచి ఏడాది పాటు శ్రమించి దీనిని తయారు చేసింది. 2021లో ఈ విమానం గాలిలో చక్కర్లు కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దీనికి టెస్ట్ ఫ్లైట్ చేపట్టగా.. 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగన విహారం చేసింది. సాధారణ విమానం ముందుకు వెళ్లడానికి రెండు రెక్కలకు రెండు ప్రొపెల్లర్స్ ఉంటాయి. కానీ.. అలైస్‌లో మాత్రం మూడు ప్రొపెల్లర్స్ ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెంటిండినీ చెరో రెక్కకు అమర్చారు.
ప్రమాదం తర్వాత..
ప్రయోగాల సమయంలో అలైస్ నమూనాలో 2020 జనవరి 22న అగ్ని ప్రమాదం సంభవించింది. పాసింజర్ ఏరియాలో ఉండే అండర్ ఫ్లోర్ బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం తర్వాత విమానం నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ ఇంటర్ కనెక్షన్ సిస్టమ్ తయారీ కోసం జీకేఎన్ ఏరోస్పేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంతో అలైస్ తయారీ విజయవంతమైంది. సీమెన్స్, మాగ్నిక్స్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ మోటార్లను అలైస్ విమానాల కోసం వినియోగిస్తున్నారు.
60 నుంచి 80 శాతం ఖర్చు ఆదా...
ప్రస్తుతం వినియోగిస్తున్న సంప్రదాయ ఇంధనంతో పోలిస్తే విద్యుత్ ఆధారిత విమానం వినియోగంలో ఖర్చు చాలా తక్కువ. ‘సెస్‌నా కార్వాన్’ అనే ఒక చిన్న విమానం 160 కిలోమీటర్లు ప్రయాణించేందుకు దాదాపు రూ.27 వేల ఇంధనం ఖర్చవుతోంది. కానీ.. అలైస్ ఎలక్ట్రిక్ విమానంలో 160 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం రూ.8 వేల వరకు మాత్రమే ఖర్చవుతోంది. అంటే దాదాపు 60 నుంచి 80 శాతం వరకూ ఖర్చును ఆదా చేసుకోవచ్చు.
అందరి చూపూ.. అలైస్ వైపే
విమానయాన రంగంలో విప్లవం సృష్టిస్తున్న అలైస్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రఖ్యాత కార్గో సంస్థ డీహెచ్‌ఎల్ తన సరకు రవాణా కోసం 12 విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. అదేవిధంగా అమెరికాకు చెందిన కేప్ ఎయిర్, గ్లోబర్ క్రాసింగ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం పదుల సంఖ్యలో ఆర్డర్లు బుక్ చేశాయి.
2024 నాటికి పూర్తిస్థాయిలో అలైస్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌లు గాలిలో దూసుకుపోతాయని అంచనా వేస్తున్నారు. విమానయాన రంగంలో కర్బన ఉద్గారాల నియంత్రణకు ఎయిర్‌లైన్స్ సంస్థలు అలైస్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను అలైస్ అధిగమించగలదా లేదా అనే సందేహాలూ ఉత్పన్నమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment