జెమీమా, క్యాప్సీ మెరుపులు
పరుగు తేడాతో బెంగళూరు ఓటమి
రిచా ఘోష్ అర్ధ సెంచరీ వృథా
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాదీ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ఆదివారం ఆఖరి బంతిదాకా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుపై గెలుపొందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకిది ఐదో విజయం. మొదట ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
పవర్‌ప్లేలో ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), షఫాలీ వర్మ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) 54 పరుగులతో శుభారంభమిచ్చారు. తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. మూడో వికెట్‌కు ఇద్దరు కలిసి 61 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. జెమీమా 26 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది.
స్పిన్నర్ శ్రేయాంక 4 వికెట్లు తీసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (5) విఫలమైనా... టాపార్డర్‌లో సోఫీ మోలినెక్స్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఎలీస్ పెరీ (32 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరును నడిపించారు. ఓవర్ వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ దశలో రిచా ఘోష్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ డివైన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మ్యాచ్‌పై ఆశలు రేపారు.
చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా, రిచా రెండు భారీ సిక్స్‌లు బాదింది. ఒక బంతి 2 పరుగుల విజయ సమీకరణం వద్ద రిచా రనౌట్ కావడంతో పరుగు తేడాతో ఢిల్లీ గట్టెక్కింది. నేడు గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరగా... ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న యూపీ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలి.
Comments
Please login to add a commentAdd a comment