ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వద్దట..
మోరల్ పోలిసింగ్ అంటూ ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు వెళ్లే పాఠశాలలకు వెళ్లే బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా వాటిపై నిషేదం విధించాలంటూ అలీఘర్ మేయర్ శకుంతల భారతి, ఎమ్మెల్యే సంజీవ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెల్ఫోన్ల వాడకంతో బాలికలు రాంగ్ డైరెక్షన్లో వెళతారంటూ వ్యాఖ్యానించారు.
మొబైల్ ఫోన్లు చేతికిస్తే లేనిపోని సంఘటనలకు దారి తీయడంతో పాటు, కలవకూడని వారిని కలిసే అవకాశం ఉందని అన్నారు. అసలు బాలికలకు సెల్ఫోన్ల అవసరం ఏంటని, వాటితో వీరికి ఏంపని అని ప్రశ్నిస్తూ..తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదని సూచనలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ రాజా ఓ అడుగు ముందుకు వేసి బాలికలకు సెల్ ఫోన్ల అవసరం లేదని అన్నారు. సెల్ఫోన్ల వల్ల లాభాలు ఉన్నప్పటికీ పాఠశాల వెళ్తున్న బాలికలకు మొబైల్ ఫోన్లు అవసరం లేదన్నారు. ఈ చర్యకు తాను మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో సెల్ఫోన్ల వినియోగాన్ని నిషేధించారని, ఈసారి తాము కూడా ఈ పద్ధతిని కచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అంతేకాకుండా మహిళలు, యువతులు వాహనాలపై వెళ్లేటప్పుడు ముఖాలకు స్కార్ఫ్ కప్పుకోవడాన్ని కూడా ఎమ్మెల్యే సంజీవ్ రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలికలు, యువతులు తమ ముఖాలను వస్త్రాలతో కప్పుకోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని అన్నారు.
కాగా గతంలో మధ్యప్రదేశ్లోని సత్నాలో కూడా అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని బయట కనబడితే పోలీసులకు అప్పగిస్తామంటూ అప్పటి మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే అమ్మాయిలెవరైనా ముఖంపై ముసుగుతో కనపడితే సత్నా మున్సిపల్ కార్పొరేషన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ రాజా కూడా వివాదాలకు తావిచ్చే వ్యాఖ్యలు చేశారు.