ఇందూరుపై నిధుల వరద
మొదటిసారిగా రూ.157 కోట్లు విడుదల
గుత్ప ఎత్తిపోతలకు రూ.55.78 కోట్లు...
అలీసాగర్ మెయింటెనెన్స్కు రూ.76.58 కోట్లు
సీఆర్ఎఫ్ కింద బాన్సువాడకు రూ.25 కోట్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందూరుపై నిధుల వరద కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా జిల్లా కు రూ.157.36 కోట్లు విడుదల చేసింది. మధ్యతరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారులపై దృష్టి సారించిన ప్రభుత్వం జిల్లాకు భారీగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులుజారీ చేయడంపై ప్రజాప్రతినిధుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
గుత్ప ఎత్తిపోతలకు రూ.55.78 కోట్లు..
జిల్లాలో భారీ నీటి పారుదలశాఖ కిందకు వచ్చే అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకానికిగత ఆరు నెలలుగా విడుదలైన నిధులు అంతంతమాత్ర మే. ఈ పథకం నిర్వహణ కోసం ఆగస్టు 1, 2013 నుంచి 2014 జులై 31 వరకు రూ.28,34,57,200 అవసరం ఉంది. పలుమార్లు ప్రతిపాదనలు పం పినా.. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధులు కేటాయించిన పాపాన పోలేదు.అయితే నీటి ప్రాజెక్టుల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తామన్న కొత్త ప్రభుత్వం ఈ మేరకు రూ. 55,78,00,350లు కేటాయిస్తూ శనివారం రాత్రి పొద్దుబోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులతో అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.అరవిందరెడ్డి ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లాలో మరో ప్రధానమైన ఎత్తిపోతల పథకం అలీసాగర్ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.76,58,26,532లు విడుదల చేసింది. ఈ ఎత్తిపోతల పథకం పరిధిలోని మూడు పంపింగ్ కేంద్రాల నిర్వహణకు 2015 జులై 31 వరకు నిధులు వినియోగించాలని పేర్కొంది. అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్వహణకు కూడ నిధుల కావాలని పలుమార్లు సంబంధిత ఇంజినీర్లు ప్రతిపాదనలు పం పనా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రూ.76.58 కోట్లు విడుదల చేస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కాగా రహదారులు, భవనాల శాఖ ద్వారా సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్ఎఫ్) కింద ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది.రాష్ర్టంలో 8 జిల్లాలకు 27 పనుల కోసం రూ.309.25 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. జిల్లాలోని బాన్సువాడ-ఉప్పల్వాయి రోడ్డు కోసం రూ.25 కోట్లు విడుదల చేసింది.