వచ్చే వారంలో 2 ఐపీఓలు
ఆల్కెమ్ ల్యాబ్.. రూ.1,350 కోట్లు
డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్.. రూ.600 కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే వారం రెండు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నాయి. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, డాక్టర్ లాల్ ప్యాథ్‌ల్యాబ్స్.. ఈ రెండు కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరిస్తాయని అంచనా. ఈ రెండు కంపెనీల ఐపీఓలు వచ్చే నెల 8న ప్రారంభమై 10న ముగియవచ్చు. మరోవైపు హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫీబీమ్ ఇన్కార్పొరేషన్ కూడా నిధుల సమీకరణ కోసం ఐపీఓకు రానున్నాయి. వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో ఈ కంపెనీల ఐపీఓలు రావచ్చు.
ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ 1.28 కోట్ల (10.75 శాతం వాటా) షేర్లను జారీ చేసి రూ.1,350 కోట్లు సమీకరిస్తుందని అంచనా. మరోవైపు డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ 1.16 కోట్ల(14.1 శాతం వాటా) షేర్ల జారీ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కాగా ఈ ఏడాదిలో 40కి పైగా కంపెనీలు ఐపీఓ పత్రాలను సెబీకి సమర్పించాయి. 31 కంపెనీల ఐపీఓలకు ఇప్పటికే సెబీ అనుమతినిచ్చింది. ఇప్పటివరకూ 18 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ. 11,000 కోట్లు సమీకరించాయి.