దేశ ప్రగతికి బ్రాహ్మణ జాతి తోడ్పడింది
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
కావడి (కేరళ): స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నేటి వరకూ భారతదేశ ప్రగతికి బ్రాహ్మణజాతి ఎంతగానో తోడ్పడిందని, అటువంటి జాతిని కుటిల ప్రయత్నాలతో అన్ని రాష్ట్రాల్లోనూ అణగ దొక్కేస్తున్నారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆది శంకరాచార్యుల జన్మస్థలమైన కేరళలోని ‘కాలడి’ గ్రామంలో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రాహ్మణుల సలహాలూ, సూచనలు పాటించడం వల్లే అప్పట్లో రాజ్యాలు సుభిక్షంగా ఉండేవని, యజ్ఞ యాగాదులతో రాజ్యాలు సుఖ సంతోషాలతో ఉండేవని అన్నారు.
కానీ నేడు బ్రాహ్మణులను గుర్తించి వారి సూచనలను, సలహాలను పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. శంకరాచార్య, శ్రీ రామానుజ, శ్రీ మధ్వాచార్యుల సాంప్రదాయ పీఠాలను, భక్తులను, బ్రాహ్మణ జాతి సభ్యులందరినీ కలుపుకుని త్వరలో భారతదేశం మొత్తం పర్యటించి, బ్రాహ్మణ జాతిని చైతన్య పరిచి అన్ని రకాలా ప్రాధాన్యత ఇచ్చేవరకూ ముందుండి నడిపిస్తామని పేర్కొన్నారు.