రామకృష్ణకు హైకోర్టు గట్టి షాక్
- మరో న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలతో రామకృష్ణ పిటిషన్
- ఆరోపణలు చేసి ఆధారాలు చూపకపోవడంపై ధర్మాసనం మండిపాటు
- రామకృష్ణ చర్యలను ఖండించిన న్యాయ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆరోపణలతో సస్పెండైన జూనియర్ సివిల్ జడ్జి సంకు రామకృష్ణకు ఉమ్మడి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. రామకృష్ణ తాజాగా ఉమ్మడి హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణపై చేసిన ఆరోపణలను హైకోర్టు ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జస్టిస్ శంకర నారాయణపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఆ వ్యాజ్యానికి అసలు విచారణార్హతే లేదని తేల్చిచెప్పింది.
రిజిస్ట్రార్ విజిలెన్స్ గా బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ, అప్పటి కడప జిల్లాజడ్జి గౌస్ బాషా తదితరులు తనపై కుట్రపూరితంగా వ్యవహరించారని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణార్హతపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ వ్యాజ్యం అభ్యంతరాల దశలోనే న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై రామకృష్ణ వాదనలు విని తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం రెండురోజుల క్రితం తీర్పు వెలువరించింది. న్యాయాధికారులు తనపై కుట్ర చేశారని ఆరోపణలు చేసిన రామకృష్ణ, అందుకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా కోర్టు ముందు ఉంచకపోవడాన్ని ప్రశ్నించింది.
మూడు అభియోగాలు
‘రామకృష్ణపై ప్రధానంగా మూడు అభియోగాలున్నాయి. గుంటూరు జిల్లా, పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న సమయంలో ధూళిపాళ గంగాధర్ అనే వ్యక్తితో అనేకమార్లు మొబైల్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. కోర్టు పనివేళల్లో బెంచ్‌పై నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ఆ పని చేయకుండా కుటుంబసభ్యులకు చెందిన ఒలింపియాడ్ స్కూల్ వ్యవహారాల గురించి గంగాధర్‌తో మాట్లాడుతూ వచ్చారు. విధుల నిర్వహణ సమయంలో సొంత పనులు చేసుకోవ డం తీవ్ర క్రమశిక్షణారాహిత్యం. పాఠశాల ప్రమోషన్, ఇతర కార్యక్రమాల కోసం గంగాధర్‌కు రూ.40 వేల చెక్కు కూడా ఇచ్చారు. గంగాధర్ సేవలను ఉపయోగించుకుని అతనికి ఇవ్వాల్సిన రూ.1.19 లక్షలను చెల్లించకుండా బయటకు గెంటేశారు. దీనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది.
ఈ విషయాలను అతను ఎక్కడా తన పిటిషన్లో నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. తనపై ఆరోపణలను ఎక్కడాఖండించలేదు. గంగాధర్ ఫిర్యాదు ఆధారంగానే రామకృష్ణపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే, రామకృష్ణ గంగాధర్‌పై కాకుండా తనపై కుట్ర చేశారంటూ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించిన జస్టిస్ శంకర నారాయణ, అప్పటి న్యాయాధికారి గౌస్ బాషాలపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిని బట్టి అసలు కుట్రదారులు ఎవరో.. కుట్ర ఎక్కడ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద తాను పెట్టిన దరఖాస్తు ఆధారంగా రామకృష్ణ కుట్ర థియరీని అల్లుకుంటూ వచ్చారు. ఏ దరఖాస్తు గురించి అతను చెబుతున్నారో దానినిగానీ, దానికి బీఎస్ఎన్ఎల్ అధికారులు ఇచ్చిన సమాధానాన్నిగానీ రామకృష్ణ కోర్టు ముందుంచలేదు. తన దరఖాస్తును, అధికారుల సమాధానాన్ని సమర్పించనప్పుడు, వాటి ఆధారంగా విచారణపై దొడ్డిదారిన దాడి చేయడానికి మేం అంగీకరించబోం.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
రామకృష్ణ చర్యలు న్యాయవ్యవస్థపై దాడే...
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉద్యోగులపై.. న్యాయాధికారులపై.. హైకోర్టు న్యాయమూర్తులపై సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్.రామకృష్ణ చేస్తున్న తప్పుడు ఆరోపణలను న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు అభివర్ణించారు. రామకృష్ణ చర్యలను క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు హైకోర్టును కోరారు. రామాంజులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, అతనిని హత్య చేసినట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు మరణ వాంగ్మూలం సృష్టించిన రామకృష్ణ న్యాయవ్యవస్థకు మాయని మచ్చని అన్నారు.
చేసిన తప్పుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే న్యాయవ్యవస్థను, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. రామకృష్ణ ఫిర్యాదుల ఆధారంగా జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని న్యాయశాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలను పట్టించుకోకుండా వెంటనే విధులకు హాజరు కావాలని వారు జస్టిస్ నాగార్జునరెడ్డికి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బోద లక్ష్మారెడ్డి, రెండు రాష్ట్రాల సంఘాల అధ్యక్షులు జగన్నాథం, రమణయ్య పాల్గొన్నారు.