all india rank
-
NEET UG 2022: నీట్లో తెలంగాణ విద్యార్థికి ఐదో ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు మెరుపులు మెరిపించారు. బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి ఎర్రబెల్లి సిద్ధార్థరావు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. రాష్ట్రానికి చెందిన చప్పిడి లక్ష్మీచరిత 37వ ర్యాంకు, కె.జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు, వరం అదితి 50వ ర్యాంకు, యశస్వినిశ్రీ 52వ ర్యాంకు సాధించారు. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి బాలికల కేటగిరీలో చూస్తే.. చప్పిడి లక్ష్మీచరిత జాతీయ స్థాయిలో 14వ ర్యాంకులో నిలిచారు. ఇక ఎస్టీ కేటగిరీలో జాతీయ టాపర్‌గా తెలంగాణకు చెందిన ముదావత్ లితేష్ చౌహాన్, రెండో ర్యాంకును గుగులోతు శివాని సాధించారు. లవోడ్య బృంద ఐదో, బూక్యా అనుమేహ ఆరో ర్యాంకులు సాధించారు. ఓబీసీ కేటగిరీలో చూస్తే.. యశస్వినీశ్రీ ఎనిమిదో ర్యాంకు పొందారు. తెలంగాణ నుంచి నీట్ కోసం 61,207 మంది రిజి్రస్టేషన్ చేసుకోగా.. 59,296 మంది పరీక్ష రాశారు. ఇందులో 35,148 మంది నీట్‌కు అర్హత సాధించారు. గతేడాది అర్హుల సంఖ్య 28,093 మందే కావడం గమనార్హం. ఐదో ర్యాంకు సాధించిన విద్యార్థి తమ కాలేజీలో చదువుకున్నాడని శ్రీచైతన్య కూకట్పల్లి బ్రాంచి డీన్ శంకర్రావు తెలిపారు. ఏపీకి చెందిన దుర్గ సాయి కీర్తితేజ 12వ, ఎన్.వెంకటసాయి వైష్ణవి 15వ జాతీయ ర్యాంకులు సాధించారు. -
నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థినికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్
అల్లవరం (కోనసీమ జిల్లా): పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తాజాగా విడుదల చేసిన పీజీ నీట్ ఫలితాల్లో హర్షితకు 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన హర్షిత 9.3 గ్రేడ్ సాధించి విశాఖపట్నంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్‌లోనూ 9.3 గ్రేడ్ సాధించి ఎంసెట్‌లో 180వ ర్యాంక్ దక్కించుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించింది. ఎంబీబీఎస్‌లో ప్రథమ స్థానంలో నిలిచి ఆరు బంగారు పతకాలు సాధించింది. పోస్ట్రుగాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)– చండీగఢ్ నిర్వహించిన ప్రవేశపరీక్షలోనూ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. పీడియాట్రిక్స్‌లో పీజీ చేయడమే తన లక్ష్యమని హర్షిత తెలిపారు. తమ కుమార్తె నీట్ పీజీలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యాళ్ల శ్రీనివాసరావు, కాంతామణి ఆనందం వ్యక్తం చేశారు. కాగా హర్షిత తమ్ముడు శివ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళంలోని జెమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన హర్షితకు పలువురు అభినందనలు తెలిపారు. -
‘విజయ్’గాథ: ఎలాంటి కోచింగ్ లేకుండా 22 ఏళ్లకే సివిల్స్ ర్యాంకు
తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్... ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ...! అదికూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే సాధించటమంటే ఆషామాషీ కాదు. అలాగని అహోరాత్రాలు అతడు పుస్తకాలకే అంటుకుపోయాడా? అంటే అదీ లేదు. సగటున రోజుకు 7–8 గంటల చదువుతో తన కలను నిజం చేసుకున్నాడు. సివిల్స్ బీజాన్ని చిన్ననాటే అతడి మనసులో నాటిన తల్లిదండ్రులు సలహాలను మాత్రమే ఇస్తూ, చాయిస్‌ను అతడికే వదిలేశారు. ఈ కృషిలో రెండేళ్లు అతడు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే తల్లిదండ్రులు రెండేళ్లపాటు టీవీ వీక్షణను త్యాగం చేశారు. తెనాలి: తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు సివిల్స్‌లో తొలిప్రయత్నంలోనే 682వ ర్యాంకు సాధించి, ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, మధుబాబు. రాజ్యలక్ష్మి గ్రాడ్యుయేట్ అయితే, జీఎస్టీ సూపరింటెండెంట్‌గా చేస్తున్న మధుబాబు చదువుల దాహం తీరనిది. ఇప్పటికి ఎనిమిది పీజీలు చేశారాయన. జిల్లా కలెక్టరు కావాలని ఆశ పడినా దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అటుకేసి చూసే అవకాశం లేకపోయింది. తాను అందుకోలేకపోయిన సివిల్స్ సౌధాన్ని తమ కవల పిల్లలు అజయ్‌బాబు, విజయ్‌బాబు సాధిస్తే చూడాలని తపన పడ్డారు. అలాగని వారిపై ఒత్తిడేమీ తేలేదు. పునాది బాగుండే విద్యాసంస్థల్లో చేర్పించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనిస్తూ, సలహాలు మాత్రం ఇస్తూ వచ్చారు. ఫలితంగానే విజయ్‌బాబు ఐఆర్‌ఎస్‌ను ఖాయం చేసుకున్నారు. తాతయ్య ఉత్తరంతో బీజం.. 2007లో ప్రైవేటు కాన్వెంటులో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్‌బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషపడిన తాతయ్య ప్రభాకరరావు భవిష్యత్తులో కలెక్టరు కావాలంటూ ఆశీర్వదిస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే తన మనసులో బలమైన ముద్ర పడిందని, ఇప్పటికీ ఆ ఉత్తరం తన దగ్గరుందని విజయ్‌బాబు చెప్పారు. టెన్త్‌లో 10/10 జీపీఏ సాధించాక విజయ్ తెనాలిలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. తోటివారంతా ఎంపీసీ గ్రూపు తీసుకుంటుంటే, అతను ఎంఈసీని ఎంచుకున్నారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలని రూలేం లేదు.. ఆర్ట్స్ గ్రూపుతోనే సాధించొచ్చు.’ అన్న తండ్రి సలహాను నూరుశాతం నమ్మారు. రకరకాల ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఎంపీసీ విద్యార్థులపై ఉండేంత ఒత్తిడి ఆర్ట్స్‌కు ఉండకపోవటం నిజంగా కలిసొచ్చిందని అంటారు విజయ్‌బాబు. ప్రశాంతంగా చదువుకుని 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3, 4 ర్యాంకుల్లో నిలిచానని చెప్పారు. ఐఏఎస్‌పైనే గురి.. ఇంటర్ తర్వాత డిగ్రీకి ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని విజయ్ ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం 30 వేల మంది పోటీపడితే రాతపరీక్ష, ఇంటర్వ్యూలోనూ నెగ్గి సీటు ఖాయం చేసుకున్నారు. 2019లో బీఏ ఆనర్స్‌ను ఫస్ట్ డివిజనులో పాసై జూలైలో తెనాలి వచ్చేశారు. అప్పట్నుంచి సివిల్స్‌కి గురిపెట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 682 ర్యాంకును పొందారు. గతంలో సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూలను వినటం, వారి విధానాల్లో తనకు నప్పినవి ఎంచుకుని పాటించటం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్‌తో ప్రాక్టీస్ చేయటం, దినపత్రికలు చదవటం, తనలాగే సివిల్స్‌కు తయారవుతున్న మిత్రులతో చర్చిస్తూ, తప్పొప్పులు సరిచేసుకుంటూ రెండేళ్లపాటు పడిన శ్రమకు ఫలితం లభించిందని విజయ్‌బాబు చెప్పారు. రోజూ జాగింగ్, మెడిటేషన్ విధిగా చేశానని తెలిపారు. తల్లిదండ్రులు టీవీ వీక్షణ త్యాగం చేశారని చెప్పారు. ఐఆర్ఎస్ పోస్టింగ్ తీసుకున్నా ఐఏఎస్ సాధనకు మళ్లీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తన సోదరుడు అజయ్‌బాబుతోపాటు రాసినట్టు చెప్పారు. ఇద్దరికీ బెస్టాఫ్ లక్ చెబుదాం. -
టీవీ..సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నా
కర్నూలు :కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేస్తానని ఆల్ ఇండియా ర్యాంకర్ మాధురీరెడ్డి తెలిపారు. గత నెల 5న నిర్వహించిన నీట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది హాజరయ్యారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన మాధురీరెడ్డి ఆల్ ఇండియా లెవల్లో 7వ ర్యాంకు సాధించారు. గురువారం కర్నూలుకు వచ్చిన మాధురీరెడ్డికి బంధువులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం? జ: మాది శిరివెళ్ల మండలం గోవిందపల్లె. నాన్న జి.తిరుపతిరెడ్డి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అమ్మ జి.పద్మావతి గృహిణి. తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. ప్రశ్న: పాఠశాల, కాలేజీ విద్య ఎక్కడ పూర్తి చేశారు? జ: హైదరాబాదులోని క్రిక్ స్కూల్లో 1 నుంచి 7వ తరగతి వరకు, మాదాపూర్‌లోని నారాయణ స్కూల్లో 8 నుంచి 10 వరకు చదివాను. ఇంటర్మీడియెట్ కూడా మదాపూర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో చదివి 982 మార్కులు సాధించాను. ప్రశ్న:నీట్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? జ: ఇంటర్మీడియెట్‌తో పాటు నీట్‌కు ప్రిపేర్ అయ్యాను. ప్రతి రోజు 10 నుంచి 12 గంటలు చదువుకే కేటాయించాను. నీట్ కోసం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకొని అధ్యాపకుల సలహాలు, సూచనలతో ఒక్కో సబ్జెక్టుకు సమయం కేటాయించుకొని చదివాను. ప్రతి రోజు తరగతి గదిలో క్లాస్‌లో నోట్ తయారు చేసుకొని ఏవైనా డౌట్స్ వస్తే వెంటనే సంబంధిత సబ్జెక్టు లెక్చరర్‌ను అడిగి క్లారీఫై చేసుకునేదాన్ని. ప్రతి అంశాన్ని లోతుగా చదవడం వల్ల అన్ని సబ్జెక్టులపై తక్కువ సమయంలో పట్టు సాధించగలిగాను. ప్రశ్న: నీట్లో ఆల్ ఇండియా స్థాయిలో 7వ ర్యాంకు వస్తుందని అనుకున్నారా? జ: ముందుగానే టాప్ టెన్ లక్ష్యంగా పెట్టుకొనే ప్రిపేర్ అయ్యాను. ఇందు కోసం టీవీ, సెల్‌ఫోన్, ఇంటర్నెట్కు దూరంగా ఉండి చదివాను. ఏపీ ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు వచ్చింది. నీట్లో ఆల్ ఇండియా లెవెల్లో 7వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ప్రశ్న: నీట్‌కు ప్రిపరేషన్లో పేరెంట్స్ సహకారం ఎలా ఉండేది? జ: అమ్మ, నాన్న చదువులో ఎంతో ప్రోత్సాహించే వారు. లెక్చరర్ల సహకారం కూడా మరువలేనిది. ఎప్పుడైనా టైడ్ అనిపిస్తే బ్యాడ్మింటన్ ఆడి రిలాక్స్ అయ్యేదాన్ని. ప్రశ్న:మెడిసిన్ పూర్తయ్యాక మీ లక్ష్యం? జ: మెడిసిన్ పూర్తయ్యాక కార్డియాలజీ పూర్తి చేసి కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేస్తా. -
సాయికుమార్‌కు ఆలిండియా 40వ ర్యాంకు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : సీఏ–ఐపీసీసీ ఫలితాల్లో రాజమహేంద్రవరం మాస్టర్‌మైండ్‌కు చెందిన పి.సాయికుమార్ ఆలిండియా 40వ ర్యాంకు సాధించారు. ఈ వివరాలను సంస్థ బ్రాంచ్ అకడమిక్ ప్రిన్సిపాల్ భవానీప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా, సబ్జెక్టులపై పూర్తి అవగాహనతో పరీక్షలు రాశానని వివరించారు. ఇష్టపడి చదవడం వల్లే ఈ ర్యాంకు వచ్చిందన్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు. తమ కళాశాల నుంచి అత్యధిక విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకున్నారని కళాశాల అడ్మిన్ ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ తెలిపారు.