రాత్రంతా సచివాలయంలోనే సీఎం
కోల్కతా: గడిచిన 200 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తూర్పుభారతాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కొమన్ తుఫాన్.. బాధితులనే కాదు ముఖ్యమంత్రిని సైతం నిద్రపోనీయడంలేదు. గత మూడు రోజులుగా పశ్చిమ బెంగాల్, మణిపూర్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రాణ నష్టంతోపాటు తీవ్ర ఆస్థి నష్టాన్ని మిగిచ్చింది కొమన్ తుఫాన్. సోమవారం ఉదయం నాటికి తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 70కి పెరిగింది. 50 లక్షల హెక్టార్లమేర పంటలు ధ్వంసమయ్యాయి.
ప్రధానంగా బెంగాల్ లోని 12 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 70లో 48 మరణాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి. ఈ 12 జిల్లాల్లో కలిపి మొత్తం 21 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. ఇటు కోల్ కతా నగరంలోనూ ఎడతెరిపిలేని వాన కురుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విపత్కర పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
పరిస్థితులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సంబంధిత చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇంటికి కూడా వెళ్లకుండా ఆదివారం రాత్రంతా ఆమె సచివాలయంలోనే గడిపారు. ఫోన్లో అధికారులకు సూచనలు చేశారు. వరదలు తగ్గని కారణంగా ప్రజలు తమ ఊర్లకు వెళ్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారిని మరో రెండు మూడు రోజపాలు అక్కడే ఉండేలా చూడాలని అధికారులకు చెప్పారు. కాగా, సోమవారం సాయంత్రం ఉత్తర పరగణాలు జిల్లాలో దీదీ పర్యటించనున్నారు.
ఇటు మణిపూర్ లో తుఫాను కారణంగా దాదాపు లక్ష మంది నిరాశ్రయిలయ్యారు. ఇండో- మయన్మార్ సరిహద్దులోని మోరే- రాజధాని ఇంఫాల్ మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. దీంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. చక్పి నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఇక ఒడిశాలో ఐదులక్షల మంది ఇళ్లను వదిలి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. జార్ఖండ్ లోని రెండు జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం ఉంది.