అన్ని మతాలకు సమస్థానం
* అందరి హక్కులను పరిరక్షిస్తాం
* ప్రజల మధ్య వారధులుగా మతం, సంస్కృతి నిలవాలి
* యునెస్కో కార్యక్రమంలో మోదీ
* భారత ప్రధానికి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం
పారిస్: భారత్‌లోని అన్ని మత విశ్వాసాలకు చెందిన ప్రజల హక్కులు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పరిరక్షిస్తామని.. సమాజంలో వారికి సమానావకాశాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. దేశంలోని పౌరులందరి ఐకమత్యమే జాతి శక్తిని నిర్ధారిస్తుందని, దేశంలోని అత్యంత బలహీనుడు సైతం సాధికారత సాధించిననాడే నిజమైన ప్రగతి సాధించినట్లవుతుందని మోదీ తేల్చి చెప్పారు. ‘భారత రాజ్యాంగం రూపొందిందే ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు అందాలన్న మౌలిక సూత్రం ఆధారంగా’ అని వివరించారు. పారిస్‌లోని యునెస్కో(యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రధాన కార్యాలయంలో భారీగా హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి శుక్రవారం మోదీ ప్రసంగించారు. అంతకుముందు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధానికి శుక్రవారం పారిస్‌లో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. భారత్, ఫ్రాన్స్‌ల జాతీయ గీతాలాపనల మధ్య ఫ్రాన్స్ రిపబ్లికన్ గార్డ్స్ సైనిక వందనం స్వీకరించారు.
‘మోదీ.. మోదీ’, ‘వందేమాతరం’
యునెస్కో కార్యక్రమంలో సభికుల ‘మోదీ.. మోదీ’, ‘వందేమాతరం’ నినాదాలకు భారత ప్రధాని ‘గుడ్.. గుడ్’ అంటూ ప్రతిస్పందించారు. ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న తీవ్రవాదం, హింస, విభజనవాద ధోరణులను అరికట్టేందుకు మతం, సంస్కృతి, సంప్రదాయాలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. ప్రజల మధ్య వారధులుగా మతం, సంస్కృతి నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ‘మనం అతి ప్రాచీన గడ్డపై అసాధారణ భిన్నత్వం, అపురూపమైన హృదయ వైశాల్యం, అద్భుతమైన సహజీవనం సంప్రదాయాలుగా కలిగిన ఆధునిక రాజ్యాన్ని నిర్మించుకున్నాం’ అంటూ భారత్‌కే ప్రత్యేకమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆవిష్కరించారు. ‘ప్రతీ పౌరుడి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, హక్కులను కాపాడుతాం. ప్రతీ మత విశ్వాసం, సంస్కృతి, జాతికి చెందిన పౌరులందరికీ మన సమాజంలో సమస్థానం లభించేలా చూస్తాం. వారందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తాం.
ఆశయాల సాధనకు అవసరమైన విశ్వాసాన్ని అందిస్తాం’ అని భారత్‌లోని మైనారిటీల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ప్రయత్నించారు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం, ఇటీవల పెరిగిన బీజేపీ నేతల మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలు, చర్చిలపై దాడులు.. తదితరాలతో ప్రభుత్వంపై పడిన మతవాద ముద్రను చెరిపేసే దిశగా మోదీ ప్రసంగం సాగింది. తన ప్రసంగంలో మహాత్మాగాంధీ, అరబిందోల వ్యాఖ్యలను ప్రధాని ఉటంకించారు. అంతకుముందు యునెస్కో భవనం ముందున్న అరబిందో విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరెనా బుకోవా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు కరణ్ సింగ్, బాలీవుడ్ నటి మల్లికా షెరావత్.. తదితరులు పాల్గొన్నారు. అనంతరం టెక్ మహీంద్రా కంపెనీ రూపొందించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ పోర్టల్ ఠీఠీఠీ.జీఛ్చీడౌజడౌజ్చ.ౌటజను మోదీ ప్రారంభించారు. భారత్ డిజిటల్ ఇండియా లక్ష్యానికి సహకరిస్తామని ఈ సందర్భంగా యునెస్కో ప్రకటించింది. బాలలు, మహిళల అభివృద్ధికి మోదీ సర్కారు తీసుకుంటున్నచర్యలను ప్రశంసించింది. యునెస్కోకు భారత నాయకత్వం మునపటికన్నా ఇప్పుడు మరింత అవసరమని యునెస్కో డీజీ ఇరెనా బుకోవా పేర్కొన్నారు.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* వచ్చే ఏడేళ్లలో 1.75 లక్షల మెగావాట్ల స్వచ్ఛ విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం.
* దేశ ప్రగతిని వృద్ధి రేటు గణాంకాల ఆధారంగా కాదు.. ప్రజల ముఖాల్లోని వెలుగుల ఆధారంగా గణించాలన్నది మా అభిమతం.
* ప్రతీ కుటుంబానికి ఇల్లు, ప్రతీ ఇంటికి విద్యుత్తు, అందరికీ స్వచ్ఛమైన నీరు, పారి శుద్ధ్య సౌకర్యాలు, స్వచ్ఛమైన నీటితో సాగే నదులు, స్వచ్ఛమైన నీరు, పక్షుల కిలకిలారావాలు ప్రతిధ్వనించే అడవులు.. నా ప్రభుత్వ లక్ష్యాలు. అందుకు నిధులు, విధానాలే కాదు.. సైన్స్ సాయం కూడా కావాలి.
* భారత్‌లో సైన్స్, విద్య అభివృద్ధి కోసం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న యునెస్కోకు కృతజ్ఞతలు.