మరికొన్నేళ్లు ఆడతా: యువరాజ్
కోల్‌కతా: సమస్యలతో పోరాడే తత్వం కలిగిన తాను మరి కొన్నేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలననే ఆశాభావాన్ని డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వ్యక్తపరిచాడు. తిరిగి జట్టులోకి రావడానికి చాలా కష్టపడ్డానని గుర్తుచేశాడు.
‘దేశం కోసం మరికొంత కాలం క్రికెట్‌ను ఆడగలననే అనుకుంటున్నాను. ఈ ఆటపై నాకున్న అమితమైన ప్రేమ వల్లే మళ్లీ జట్టులోకి రాగలిగాను. విండీస్ ‘ఎ’, చాలెంజర్స్ టోర్నీలో రాణించడంతో పాటు 200శాతం ఫిట్నెస్ కలిగి ఉండడం కూడా కలిసొచ్చింది.
నేనెప్పుడూ ఓ పోరాట యోధుడినే. క్రికెట్ ద్వారా వచ్చిన ఈ గుణం కారణంగా క్యాన్సర్‌తో పోరాడగలిగాను. ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జీవితాన్ని మార్చింది. ఇలా జరగాలంటే మనోశక్తితో పాటు గుండెధైర్యం ఉండాలి. మనతో మనమే పోరాడడం అంత సులువు కాదు’ అని స్థానికంగా జరిగిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ చెప్పాడు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా కూడా పాల్గొంది.