నేడు పాఠశాలల్లో జాతీయ గీతాలాపన
ఏలూరు సిటీ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి జాతీయ గీతాలాపన చేయాలని జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు సోమవారం విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9 నుంచి 23 వరకూ ఆజాదీ యాద్ కరో ఖుర్భానీగా ఏపీ పాఠశాల విద్య కమిషనర్ ప్రకటించారని తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం అన్ని పాఠశాలల్లో విధిగా జాతీయ గీతాలాపన చేయాలని కోరారు.
29న సైన్స్ సెమినార్
జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించి విజేతల వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 29న జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు డివిజన్‌స్థాయి సైన్స్ సెమినార్స్ నిర్వహించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విజేతల వివరాలు తెలియజేయాలని జిల్లా సైన్స్ అధికారి సీహెచ్‌ఆర్‌ఎం చౌదరి సోమవారం తెలిపారు. 31వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు అమీనాపేటలోని జీఎంసీ బాలయోగి సైన్స్ పార్కులో నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్ సెమినార్‌కు పంపాలని కోరారు. విజేతల వివరాలను ఒకరోజు ముందుగా తెలియజేయాలని కోరారు. జిల్లాస్థాయి విజేతలను రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌కు పంపుతామని తెలిపారు