ఆత్మలు కలుసుకునే రోజు
నేడు.. ఆల్ సోల్స్ డే!
ఆత్మలు కలుసుకునే రోజు.. పోయినోళ్లందరూ మంచోళ్లే అని కీర్తించుకునే రోజు! క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే దేశాల్లో ఓ వేడుకగా జరుగుతుంది ఈ పర్వం.. ఈ సంప్రదాయం జంటనగరాలకూ చేరింది! నారాయణగూడ, బోయిగూడ, మెట్టుగూడలోని గ్రేవియార్డ్స్ పూలతేరులై క్యాండిలైట్ కాంతుల్లో ఆత్మలను ఆహ్వానిస్తాయి!
మెక్సికోలో మొదలైన ఆల్స్ సోల్స్ డేను ఇప్పుడు ప్రపంచంలోని క్రైస్తవ దేశాలు, క్రైస్తవులు ఎక్కువగా ఉండే రాజ్యాలూ జరుపుకుంటున్నాయి. మన దగ్గర పెద్దల పండుగ, పితృ అమావాస్య లాంటిదన్నమాట. ఈ ఆల్ సోల్స్ డే ఇక్కడా అంతటా జరుపుకున్నా నారాయణగూడ, బోయిగూడ, మెట్టుగూడల్లోని క్రైస్తవ శ్మశానవాటికల్లో ఓ వేడుకలా కనిపిస్తుంది.
పూలు.. కొవ్వొత్తికాంతులు
ఒకరోజు ముందు నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతుంటాయి. పాలరాతి సమాధులనైతే కడిగి శుభ్రం చేస్తారు. రాతి సమాధుల రంగులు వెలసిపోతే వాటికి రంగులు వేస్తారు. తెల్లవారి అంటే ఆల్ సోల్స్ డే నాడు ఉదయమే చనిపోయిన తమ ఆప్తుల ఇష్టమైన వంటకాలు వండి వాటిని సమాధి దగ్గరకు తీసుకెళ్తారు. ప్రార్థన చేసి సమాధి ముందు ఆ వంటకాలను పెట్టి ఇళ్లకు వెళ్లిపోతారు. సాయంత్రం ఏడు తర్వాత అసలు పర్వం మొదలవుతుంది.
బంతిపూలు, గులాబీలతో సమాధులను చక్కగా అలంకరిస్తారు. ఆయా సమాధుల ముందు వాళ్ల వాళ్ల ఫొటోలను అమరుస్తారు. శ్మశానం గేటు దగ్గర్నుంచి సమాధి వరకు పూలతో దారి చేస్తారు. తమ ఆప్తుల ఆత్మలు ఆ పూల దారిలో నడిచి వస్తాయని ఈ ఆత్మీయుల నమ్మకం. ఆనక కొవ్వొత్తులను వెలిగించి మళ్లీ ప్రార్థిస్తారు. పెద్దల సమాధుల దగ్గర సందడి నెలకొంటే చిన్నవయసులో చనిపోయినవారి సమాధుల దగ్గర విషాదం ఆవహించి ఉంటుంది.
శ్మశానం బయట...
లోపల ఓ వాతావరణం ఉంటే బయట జాతరను తలపించే వాతావరణం ఉంటుంది. పూలు అమ్మే బళ్లు... బెలూన్లు అమ్మే అబ్బీలు... కొవ్వొత్తులు పెట్టుక్కూర్చున్న వాళ్లు... ఇంకా తినుబండారాలు అమ్మేవాళ్లు ఇలా రకరకాల బళ్లతో శ్మశానం గేటు ఎన్నడూ లేని జీవకళను కంటది. మెక్సికో గ్రేవియార్డ్స్లోనూ ఇలాంటి సందడే ఉన్నా అక్కడ పుర్రె ఆకారంలో పళ్లతో, చక్కెరతో చేసిన స్వీట్స్‌ను సమాధుల దగ్గర పెడ్తారు. శ్మశాన వాటికను ఓ పూల రథంలా అలంకరిస్తారు. ఇదీ ఆల్ సోల్స్ డే కథ.
- భరత్ భూషణ్, ఫొటో జర్నలిస్ట్