సచిన్ లేడు.. ద్రవిడ్ ఉన్నాడు!
న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు చోటు దక్కలేదు. తాజాగా సంగక్కర విడుదల చేసిన క్రికెట్ ఎలెవన్‌లో భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్ ఒక్కడికే స్థానం దక్కింది. భారత్ 'ఏ' టీమ్ కోచ్ గా ఉన్న మిస్టర్ 'డిపెండబుల్'కు సంగక్కర రెండో స్థానం కట్టబెట్టాడు. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మన్ మాథ్యూ హేడన్ కు తన జాబితాలో అగ్రస్థానం ఇచ్చాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్ ఉన్నారు.
ఎడమ చేతి బ్యాట్సమన్లలో 'ఆల్ టైమ్ ఫేవరేట్' బ్రియన్ లారా కూడా ఈ లిస్టులో చోటు దక్కింది. ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు స్థానం సంపాదించారు. భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సోమవారం న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ ప్రకటించిన ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో సచిన్ టెండూల్కర్ కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.
సంగక్కర క్రికెట్ ఎలెవన్ టీమ్
మాథ్యూ హేడెన్, రాహుల్ ద్రావిడ్, బ్రియన్ లారా, రికీ పాంటింగ్, అరవింద్ డిసిల్వా(కెప్టెన్), జాక్వలెస్ కల్లిస్, ఆడమ్ గిల్‌క్రిస్ట్(వికెట్ కీపర్),షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్, చమిందా వాస్