ఆ ఊరి పేరే గూగుల్..!
గూగులూరు
సెర్చింజన్ దిగ్గజం ‘గూగుల్’ పేరును ఎవరంటే వారు ఇష్టం వచ్చినట్టుగా వాడుకొనేందుకు లేదు. ఎందుకంటే ఆ పేరుపై ఆ కంపెనీ పేటెంట్ తీసుకొంది. అయితే ఎంత పేటెంట్ ఉన్నా కర్ణాటకలోని ఆ గ్రామస్తులు మాత్రం గూగుల్ పేరును వాడుకొంటున్నారు. మరి గూగుల్ వారిపై ఏం చర్య తీసుకోదా? అంటే... తీసుకోలేదు! అలా తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే గూగుల్ సెర్చింజన్ 1990లలో మొదలైంది. గూగుల్ అనే ఊరు అంతకంటే ముందు నుంచే ఉంది.
ఆ పేరు ఎలా వచ్చిందంటే..!
గూగుల్ అనే పేరు ఆ ఊరికి శతాబ్దాల కిందటి నుంచే ఉందట! దానికి చాలా చరిత్ర కూడా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఉత్తరంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ‘గూగుల్’ అనే ఆ ఊరు. ఇది 12వ శతాబ్దం నుంచి ఉనికిలో ఉంది. అప్పట్లో ప్రసిద్ధ కన్నడ కవి అల్లమప్రభు... బసవ కల్యాణ అనే ఊరి నుంచి మల్లికార్జునుడిని దర్శించుకోవడానికి శ్రీశైలం వె ళుతూ దారి మధ్యలో ఈ ఊరి దగ్గర ఆగాడట. ఆ ఊరి భౌగోళిక స్థితి గురించి గమనించి దానికి ‘గవి గల్లు’ అని నామకరణం చేశాడట. కన్నడలో గవిగల్లు అంటే రాతిలోయ అని అర్థం. ఆ గవిగల్లే శతాబ్దాలు గడిచే సరికి గూగుల్ అయ్యింది!
వ్యవహారికంలోనే కాదు స్థానిక ప్రభుత్వాధికారులు కూడా రికార్డుల్లో ఇంగ్లిషులో ‘గూగుల్’ గానే రాస్తున్నారు. దీంతో అధికారికంగా కూడా ఆ ఊరి పేరు గూగుల్ అయ్యింది. మరి ప్రపంచంలో ఇలా ఒక ప్రముఖవాణిజ్య సంస్థ పేరిట ఉన్న గ్రామం ఇదొక్కటేనేమో! మరో విశేషం ఏమిటంటే గూగుల్ గ్రామ జనాభా దాదాపు వెయ్యి. కానీ, చిత్రం ఏమిటంటే... తమ ఊరి పేరిట ‘గూగుల్’ అనే సెర్చింజన్, వ్యాపార సంస్థ ఉందని వారిలో చాలా మందికి తెలియదట!