కాగితం నగషీ
మగువ అందానికి పొందికగా ఒదిగిపోతాయి ఈ నగలు. ఆ ఆభరణాలు ఎక్కువ డబ్బు ఖర్చు, బరువు లేకుండా... ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు అల్లాణి రాధిక. అదీ పర్యావరణహితంగా! ఖాళీ సమయాన్ని క్రియేటివ్‌గా మార్చుకుని పేపర్‌తో జ్యువెలరీ చేస్తున్నారు ఈమె. ‘పర్యావరణాన్ని కాపాడటమంటే సింపుల్‌గా ఉండటం కాదు. ఎకోఫ్రెండ్లీగా ఉంటూనే చక్కని అలంకరణతో అందంగా కనిపించవచ్చు. ఆసక్తి ఉంటే ఏ శిక్షణా అవసరం లేదు’ అంటున్న రాధిక...
ఇంటర్నెట్ ముందు కూర్చునే ఈ పేపర్ ఆర్ట్ వర్క్ నేర్చుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న ఈమె భర్త ప్రైవేటు ఉద్యోగి. కాలేజీ లైఫ్‌లో పిల్లలు బిజీ. ఇంట్లో పని అయిపోయాక ఖాళీగా ఉన్న రాధిక... ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనతో నెట్టింట్లో సెర్చ్ మొదలు పెట్టారు. అప్పుడు తట్టిందే ఈ ఐడియా. నాలుగు నెలల్లోనే చేయి తిరిగిన ఆర్టిస్టుగా మారిపోయారు.
ఫిల్లింగ్ పేపర్‌తో కమ్మలు, గొలుసుల వంటివి ఎంతో ఆకర్షణీయంగా, ముచ్చటగా రూపొందించారామె. చూడ్డానికి ఫ్యాన్సీ జ్యువెలరీలా ఉన్న ఈ ఐటెమ్స్ ఖరీదు కూడా తక్కువే. అన్నింటి కంటే ముఖ్యంగా పర్యావరణానికి హాని చేయని ప్రొడక్ట్స్. వీటన్నింటినీ లామకాన్లోని ‘ఆర్గానిక్
బజార్’లో ప్రదర్శనకు ఉంచారు ఆమె. వచ్చిన వారందరూ వీటిని అపురూపంగా చూస్తున్నారు. ‘మనమేం చేయగలమనే కంటే ఆలోచనను ఆసక్తి ఉన్న వైపు మళ్లిస్తే ఇలా పర్యావరణం కోసం అందరూ ఎంతో కొంత చేయవచ్చు’ అనేది రాధిక అభిప్రాయం.