టోల్ తీస్తుండ్రు!
అది 44వ నంబర్ జాతీయ రహదారి.. అక్కడ అక్రమార్జనకు ‘గేట్’ తెరిచారు.. అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు.. వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగుతోంది.. నెలవారి పాసుల్లోనూ తిరకాసు.. వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.. అయినా పాలక నేతలకు పట్టదు.. తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని టోల్‌ప్లాజా నిర్వాహకుల ఇష్టారాజ్యంపై కథనం...
తూప్రాన్: తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని జాతీయ రహదారిపై (44వ నంబరు ) ఏర్పాటు చేసిన టోల్గేట్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వాహనాదారులనుంచి టోల్గేట్ రుసుము పేరుతో దోపిడీ చేస్తున్నారు. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. టోల్గేట్ రుసుమును అధిక మొత్తంలో వసూలు చేస్తుండడంతో పలుమార్లు టోల్గేట్ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టిన సంఘటనలు కొకొల్లలు. టోల్గేట్ రుసుము చెల్లించలేక కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం టోల్గేట్ మీదుగా 10 నుంచి 12 వేల వరకు వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి. దీంతో రోజువారీ టోల్గేట్ ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటుంది. దీంతో పాటు ప్రతియేటే టోల్గేట్ నిర్వాహకులు ఏప్రిల్ మాసంలో 15 శాతం రేట్లను పెంచుతూ వస్తున్నారు. ఫలితంగా వాహనదారులు సొంత వాహనాల్లో తిరగడం ఇబ్బందిగా మారింది.
నాలుగు లేన్ల విస్తరణ...
నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ఎన్‌హెచ్ 44ను తూప్రాన్ మండలం కాళ్లకల్ నుంచి నిజామాబాద్ జిల్లా అడ్లూరు, ఎల్లారెడ్డి వరకు 85.745 కిలో మీటర్ల రోడ్డును 546.15 కోట్ల వ్యయంతో నాలుగు లేన్లకు విస్తరించారు. 2006 సెప్టెంబరు 27న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులు 30 నెలలు కొనసాగాయి. పనులు పూర్తయిన వెంటనే రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లి నుంచి నిజామాబాద్ జిల్లా అడ్లూరు, ఎల్లారెడ్డి వరకు 106 కిలో మీటర్లు పొడవుకు తూప్రాన్ మండలం మనోహరాబాద్ వద్ద టోల్‌గేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ ప్రాంత రైతులు కోర్టుకు వెళ్లడంతో అల్లాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో టోల్గేట్ ఏర్పాటు చేసి, 2009 ఏప్రిల్ 20 నుంచి టోల్గేట్ రుసుము వసూలు చేస్తున్నారు.
వసూళ్లకు పాల్పడుతున్న నిర్వాహకులు..
టోల్గేట్ నిర్వాహకులు కారు, జీపు, వ్యాన్ టోల్గేట్ మీదుగా వెళితే రూ.125లు వసూలు చేస్తున్నారు. 24 గంటల్లో తిరిగి వస్తే రూ.185 వసూలు చేస్తున్నారు. లైట్‌గూడ్స్ వెహికిల్ మినీ బస్సులకు రూ.200లకు పెంచారు. అదే రోజు తిరిగి వస్తే రూ.300 వసూలు చేస్తున్నారు. ట్రక్కు, బస్సు లాంటి వాహనాలకు రూ.415లు, అదేరోజు తిరిగి వస్తే రూ.625లు వసూలు చేస్తున్నారు. ఎర్త్‌మూవింగ్ ఎక్విప్మెంట్ లాంటి వాహనాలకు రూ.650లు వచ్చేటప్పుడు రూ.980లు వసూలు చేస్తున్నారు. భారీ వాహనాలకు రూ.795లు, తిరిగిరావడానికి రూ. 1190లు వసూలు చేస్తున్నారు.
దోపిడీ జరుగుతోంది ఇలా...
ప్రభుత్వ రికార్డుల్లో టోల్‌ప్లాజా తూప్రాన్ మండలంలో మనోహరాబాద్‌లో కొనసాగుతున్నట్లు రికార్డుల్లో ఉంది. కానీ అల్లాపూర్ శివారులో టోల్‌ప్లాజా ఏర్పాటు చేశారు. ఇందుకు కారణం మనోహరాబాద్ రైతులు తాము పట్టా ్ట భూములు కోల్పోతున్నామని కోర్డును ఆశ్రయించడమే. నిజామాబాద్ జిల్లా అడ్లూరు, ఎల్లారెడ్డి నుంచి తూప్రాన్ మండలం మనోహరాబాద్‌కు 67.215 కిలోమీటర్లు. అల్లాపూర్ శివారులోని టోల్‌ప్లాజా నుంచి మనోహరాబాద్ మధ్య దూరం 08 కిలోమీటర్లు అంటే 59 కిలోమీటర్లు మాత్రమే. ఇందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు మాత్రం అడ్లూరు, ఎల్లారెడ్డి నుంచి రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లి వరకు నాలుగు లేన్ల రహదారిగా విస్తరణ చేపట్టిన 106 కిలోమీటర్లకు టోల్ వసూలు చేస్తున్నారు.
వాస్తవానికి ప్రభుత్వ గెజిట్‌లో ఒక్క కిలోమీటరుకు రూ. 0.65 పైసల చొప్పున టోల్ వసూలు చేయాలని ఉంది. అదికూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన వారే టోల్ వసూలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ రుసుమును నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు చెల్లించడంలో అర్థం ఉంది. కానీ రామాయంపేట, మెదక్, చేగుంట తదితర ప్రాంతాల వారు మేడ్చేల్ వరకు 30 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించేవారు 106 కిలోమీటర్ల టోల్ రుసుం చెల్లిస్తున్నారు. అంటే బహిరంగానే టోల్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే మేడ్చల్ వైపు నుంచి తూప్రాన్ వరకు వచ్చే వాహనాదారులు నిజామాబాద్ జిల్లా వరకు నిర్మాణం చేపట్టిన 106 కిలోమీటర్లగాను టోల్ రుసుము చెల్లిస్తున్నారు. వీరు కేవలం 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రభుత్వ గెజిట్ ప్రకారం కిలోమీటరుకు రూ.0.65 చొప్పున రూ.16 మాత్రమే చెల్లించాలి కానీ టోల్గేట్ నిర్వాహకులు మాత్రం రూ.125 బలవంతంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా నిలదీస్తే భౌతిక దాడులకు పాల్పడిన సంఘటనలు అనేకం. ప్రతియేటా టెండర్లు ద్వారా దక్కించుకున్న ఐదుగురు టోల్ కాంట్రాక్టర్లు మారారు. మొదటి సంవత్సరం హైవే అధికారులే టోల్ రుసుం వసూలు చేశారు. అనంతరం టెండర్లను ఆహ్వానిస్తూ వస్తున్నారు.
నెలవారి పాసుల్లోనూ తిరకాసు...
టోల్‌ప్లాజా నిర్మాణ సమయంలో టోల్‌ప్లాజా పరిధిలోని నాలువైపుల 20 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల వాహనదారులకు ఉచితంగా పాసులు అందిస్తామన్నారు. మొదట్లో కొన్ని నెలల పాటు అమలు చేసిన నిర్వాహకులు అనంతరం నెలకు రూ.200 చెల్లించాలనే నిబంధన విధించారు. అది కూడా వాహనదారుడు సొంత వాహనమై ఉండి అతనిపేరున రిజిష్టరు అయి ఉండాలి. అప్పుడే పాసులు అందిస్తున్నారు. అదికూడా కొందరికే.. నీలదీసినవారిపై పోలీసు కేసులు బనాయిస్తున్నారు. తూప్రాన్ మండలంలోని వివిధ గ్రామాల వాహనదారులు సైతం టోల్ రుసుం చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పనులమీద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు తప్పనిసరిగా టోల్‌ప్లాజా దాటి రావాల్సిందే. వారికి టోల్ తిప్పలు తప్పడంలేదు.
ప్రస్తుతం వారు ఇస్తున్న రశీదులో టోల్ ప్లాజా మనోహరాబాద్గా నమోదై ఉండడం గమనార్హం. గతంలోను టోల్ రుసుం పెంచుకునేందుకు టోల్‌ప్లాజాను తప్పించుకుని అల్లాపూర్, ఇమాంపూర్ గ్రామాల మీదుగా ఎవరూ వెళ్లకుండా కాపలాదారులను ఏర్పాటు చేసి వాహనాలు అటుగా వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇందుకు సహకరించిన గ్రామ పంచాయతీలకు వాటర్ ప్లాంట్లను అందజేసి రెవెన్యూ పెంచుకున్నారు. ఇందుకు పోలీసులు కూడా సహకరించినట్లు తెలిసింది.