జీవితతో మాట్లాడటానికి ఇష్టపడేవాడ్ని కాదు..
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమనీ.. 'అల్లరి ప్రియుడు' చిత్రంలో అలరించే ఈపాటను మర్చిపోగల వారెవరు? ప్రేమలో మాధుర్యాన్ని సుమనోహరంగా వర్ణించిన ఈ గీతాన్ని జ్ఞాపకాల నుంచి చెరిపేయగల వారెవరు? నిజం.. ప్రేమ అంత మధురభావం. అది అనుభవమైన వారి జీవితం ధన్యం. అల్లరిప్రియుడిగా ఈపాటలో అభినయించిన రాజశేఖర్ కు అది అనుభవమైంది. వేరే సినిమాలో కలిసి నటించిన జీవిత జీవన భాగస్వామిగా మారింది. ఇప్పుడా జంట తోడునీడగా బతుకునావలో పయనం సాగిస్తోంది. విశాఖకు వచ్చిన సందర్భంగా ఆ జంట తమ వలపు ముచ్చట్లను ఇలా 'సిటీప్లస్' తో పంచుకుంది.
రాజశేఖర్: తలంబ్రాలు చిత్రంలో జీవిత, నేను కలిసి తొలిసారిగా నటించాం. అందులో నాది నెగెటివ్ రోల్. అయితే వ్యక్తిగతంగా నా తీరు అందుకు పూర్తిగా భిన్నం. పెద్దగా అమ్మాయిలతో మాటాడేవాడిని కాను. అప్పటికే మెడిసిన్ కంప్లీట్ చేసి సినిమాలంటే ఇష్టం కొద్దీ తెరపైకి వచ్చాను. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పేశాను కూడా. యాక్టింగ్ తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. అయితే మొదట్లో మా ఇద్దరి మధ్య సంభాషణ కొద్దిగా ఇగోతోనే మొదలైంది. ఆమె నాకంటే బాగా నటించేది. దాంతో బేసిగ్గానే కాస్త అసూయ ఉండేది. ఆమెతో మాట్లాడటానికి ఆసక్తి చూపేవాడిని కాదు. కానీ క్రమంగా స్నేహం పెరిగింది. ప్రేమ కలిగింది. కానీ అప్పుడు కూడా మా మధ్య ప్రేమ ఉన్నదనే విషయం మాకు తెలియదు. ఆ విషయం తనే నాకు చెప్పింది. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.
జీవిత: అతన్ని నాకు తెలియకుండానే ఇష్టపడేదాన్ని. అతను వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రమేం.. నేను ప్రేమించకూడదని ఏమైనా ఉందా అని ప్రశ్నించేటంత ఇష్టం ఉండేది. మామూలుగా ఉండే నేను కావాలనుకున్న దాని గురించి ఎంత వరకైనా వెళ్తానని అలా అర్ధమైంది. నా ఇష్టం అతనికి నచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం పెళ్లితో ముడిపడింది.
తనే నా బలం..
రాజశేఖర్: (నవ్వుతూ).. ఆమె నన్ను ప్రేమించింది. నేను దొరికిపోయాను.. ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే ఉంది. ఆ శక్తి ఎంత గొప్పదనిపిస్తుంది. తను నేనంటే ప్రాణం పెడుతుంది. నాకోసం ఎంతో చేస్తుంది. సర్దుకుపోతుంది. నాకు కోపం ఎక్కువ. మగాళ్లో కనిపించే ఇగో నాలో కూడా ఉంది. కొన్ని సార్లు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లాక కూడా సీరియస్‌గా ఉంటా. ఆ క్షణం ఆమె చాలా కామ్‌గా ఉంటుంది. కోపంతో ఏమైనా అన్నా తనే సారీ చెబుతుంది. హీరోగా బిజీ అయిన తర్వాత ఇంటి బాధ్యత మొత్తం జీవిత తీసుకుంది. నన్ను ఓ పిల్లాడిలా చూసుకుంది. నా అవసరాలన్నీ తీరుస్తుంది. ఇలాటి ఇల్లాలు ఉంటే ఇక కావాల్సిందేముంది? అందుకే నా బలం అంతా జీవితనే..
జీవిత: భార్యగా బాధ్యతలు చూసుకోవడంలో తప్పేముంది? భర్త, పిల్లల మంచి చెడ్డలు చూసుకోవడం సంతోషకరమే కదా. ఒత్తిడితో ఇంటికి వచ్చే భర్తకు భార్య వల్ల ఉపశమనం కలగాలి. ప్రేమ ఉంటే ఇగో ఉండకూడదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఇద్దరూ ఒకటే అయితే ఎవరు సారీ చెబితే ఏముంది? ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్లలేక. మా కోసం ఈయన చాలా అవకాశాలు వదిలేసుకున్నారు. నా కోసం, పిల్లల కోసం అంత చేసినపుడు నేను కొంతైనా చేయాలి కదా.. ప్రేమ ఉన్న చోట కోపం కూడా ఉంటుంది. దాన్ని అర్ధం చేసుకుంటే సమస్య ఉండదు.
ప్రేమలో నిజాయితీ ముఖ్యం
రాజశేఖర్: ఈ జనరేషన్ పిల్లలకు మేము చెప్పాల్సింది ఒకటే. మీ ప్రేమలో నిజాయితీ ఉందోలేదో చూసుకోండి. మగవారిమనే ఇగో పక్కన పెట్టి.. అభిప్రాయభేదాలు ఉంటే వెంటనే వెళ్లి సారీ చెప్పేయండి. ఆడవాళ్లకు క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి కనిపించింది...అందంగా ఉంది. ఇష్టపడ్డాం అనుకుంటే ఆ ప్రేమ ఎంత వరకు నిలబడుతుందో నమ్మకం ఎక్కడిది?
జీవిత: ఇప్పటి జనరేషన్లో పిల్లలకు వయస్సుకు మించిన ఆలోచనలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కల్పించిన సౌకర్యాలను, అందించిన అవకాశాలను కొందరు సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. అనవసరపు వ్యామోహాలు, ఆలోచనలకు పోయి తెలియని ఆకర్షణకు లోనవుతున్నారు. దానిని ప్రేమ అనుకుంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఆలోచించాలంటున్నా. ప్రేమో కాదో తేల్చుకున్నాకే నిర్ణయం తీసుకోమంటున్నా. ఇది ముఖ్యంగా ఆడపిల్లలకు చెబుతున్న మాట.