అల్లీ‘పూర్’!
అడుగంటిన భూగర్భ జలం
ఈ గ్రామంలో 54.15 మీ.లోతుకు జలం
జిల్లాలో అత్యధిక లోతు ఇక్కడే!
కొన్ని మండలాల్లో మెరుగైన పరిస్థితి
సాక్షి, సంగారెడ్డి: అడపాదడపా కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలలు కొన్ని ప్రాంతాల్లో పెరిగినా.. చాలా వరకు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. గత నెలలో 24.64 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ నెలలో 23.64 మీటర్లకు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే అత్యధికంగా అల్లీపూర్లో భూగర్భ జలం అడుగుకంటిందని తెలుస్తోంది.
చిన్నకోడూరు మండలంలో గల ఈ గ్రామంలో భూగర్భజలాలు ప్రస్తుతం 54.15 మీటర్ల లోతున చేరుకున్నాయి. జిల్లాలో ఇక్కడే అత్యదిక లోతుకు భూగర్భజలం పడిపోయిందని అధికారులు అంటున్నారు. అలాగే, పటాన్చెరు మండలం కిష్టాపూర్‌లో మాత్రం 1.41 మీటర్లలోనే జలాలు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అత్యధికంగా నంగనూరు మండలం ఖాతా గ్రామంలో 15.95 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి.
ఖాతా గ్రామంలో జూన్‌లో 32.50 మీటర్లలో జలాలు ఉండగా.. జూలై చివరకు 24.63 మీటర్లకు పెరిగాయి. కల్హేర్ మండలంలో 7.97 మీటర్లు, నారాయణఖేడ్‌లో 5.36, సంగారెడ్డిలో 5.34, న్యాల్కల్లో 3.30, గజ్వేల్‌లో 1.48, మెదక్‌లో 1.22, జిన్నారంలో 1.20, రామచంద్రాపురంలో 1.12, చిన్నకోడూరులో 1.08, హత్నూరలో 1.04 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు పెరిగాయి. మిగితా మండలాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
కొంత మెరుగు.. ఇంకొంత తరుగు..
భూగర్భ జలాల తీరు జిల్లా వ్యాప్తంగా ఒక్క తీరుగా లేదు. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో మంజీరా నదితో పాటు చెరువులు ఎండిపోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దిగువకు భూగర్భజలాలు పడిపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. ఫలితంగా తాగు, సాగుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో గడిచిన రెడు నెలల్లో పడిన మోస్తరు నుంచి భారీగా వర్షాలతో భూగర్భజలాల మట్టాలు కొన్ని ప్రాంతాల్లో పెరిగాయని అధికారులు అంటున్నారు. వర్షపునీరు భూమి పొరల్లోకి మెల్లిగా ఇంకుతుందని, దీంతో ఒక్కసారిగా జలమట్టాలు పెరగవని జియాలజిస్టులు చెబుతున్నారు.