కొలిక్కి వచ్చిన అసెంబ్లీ భవనాల కేటాయింపు
హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలోని భవనాల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల స్పీకర్లు ఏకాభిప్రాయానికి వ చ్చారు. రెండు రాష్ట్రాలకు భవనాలు కేటారుుస్తూ గవర్నర్ నరసింహన్ ఇప్పటికే జీవో విడుదల చేశారు. తాజాగా ఇద్దరు స్పీకర్ల మధ్య ఒక అవగాహన కుదిరింది. అరుుతే రెండు రాష్ట్రాలకు చెందిన నేతలకు ఎవరికి ఏ గది కేటాయించాలన్న దానిపై స్పీకర్లు ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, ఎస్.మధుసూదనాచారి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సమావేశమయ్యారు. గవర్నర్ ఉత్తర్వులపై ఈ భేటీలో చర్చించారు. పాత అసెంబ్లీ భవనాన్ని పూర్తిగా ఏపీకి, కొత్త అసెంబ్లీ భవనాన్ని తెలంగాణకు గవర్నర్ కేటాయించారు.
అరుుతే పాత అసెంబ్లీ భవనంలోని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డికి కేటాయించిన చాంబర్ మినహాయించి తక్కిన అన్ని గదులను ఖాళీ చేసి ఏపీకి ఇవ్వనున్నారు. పాత అసెంబ్లీ భవనంలోనే పై అంతస్తుల్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల గదులను ప్రస్తుతం రెండు రాష్ట్రాల సిబ్బంది ఉమ్మడిగా వినియోగిస్తున్నారు. ఇక ముందు కూడా ఇదే తీరున ఉమ్మడిగానే రెండు రాష్ట్రాల సిబ్బంది ఆ గదులను వినియోగించుకోనున్నారు. రెండు అసెంబ్లీల మధ్యలో రెండువైపుల ఉన్న భవనాల్లో ఒకవైపు గదులను ఏపీ మంత్రులకు, ఇంకోవైపు గదులను తెలంగాణ మంత్రులకు చాంబర్లుగా కేటాయిస్తారు. ఈ భవనాల్లోనే పై అంతస్తులో ఉన్న మూడు కమిటీ హాళ్లను అవసరానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా వినియోగించుకోనున్నాయి. ఇక నాలుగు అంతస్తుల అసెంబ్లీ సచివాలయ భవనంలోని రెండు అంతస్తులను తెలంగాణకు, రెండు అంతస్తులను ఏపీకి ఇచ్చారు. ఇదివరకు దీనిపై గవర్నర్ సమక్షంలో లాటరీ తీయగా కిందనున్న ఒకటి, రెండు అంతస్తులు ఏపీకి, మూడు, నాలుగు అంతస్తులు తెలంగాణకు వచ్చాయి. దీనికి కొన్ని సవరణలు చేయూలని తెలంగాణ నేతలు చేసిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటివరకు సీఎల్పీ, టీఆర్ఎస్ఎల్పీ, వైఎస్సార్ సీఎల్పీ, ఎంఐఎం ఎల్పీ కార్యాలయాలున్న ఆర్సీ భవనాన్ని పూర్తిగా తెలంగాణకే కేటాయించారు. గ్రంథాలయాన్ని ఇరు రాష్ట్రాలు అవసరానికి అనుగుణంగా ఉమ్మడిగా వినియోగించుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు.
మండలి చైర్మన్‌కు చాంబర్
శాసనమండలిలో ఇదివరకు మంత్రి శ్రీధర్‌బాబు వినియోగించిన చాంబర్ ఇక తెలంగాణ శాసనమండలి చైర్మన్ చాంబర్‌గా మార నుంది. ఇరు రాష్ట్రాల మండళ్లలో ప్రతిపక్ష నేతలు, ఆయా పార్టీల సభాపక్ష కార్యాలయాలకు, మంత్రులకు, చీఫ్ విప్, విప్‌లకు చాంబర్ల కేటాయింపుపై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఇప్పటివరకు వినియోగిస్తున్న పాత అసెంబ్లీ భవనంలోని చాంబర్‌ను ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయించనున్నారు. అదే విధంగా ఏపీ కార్యదర్శి సత్యనారాయణ ఉన్న చాంబర్‌ను వైఎస్సార్ సీఎల్పీకి ఇవ్వనున్నారు.
వేర్వేరు సమయూల్లో సమావేశాలు
ఇరు రాష్ట్రాల అసెంబ్లీ, మండళ్ల సమావేశాలు ఒకేసారి జరిగే పక్షంలో వేర్వేరు సమయాల్లో నిర్వహించడం మంచిదన్న అభిప్రాయానికి స్పీకర్లు వచ్చారు. రెండు అసెంబ్లీలు, మండళ్ల సమావేశాలు ప్రారంభ సమయాల మధ్య అరగంట లేదా గంట వ్యవధి ఉండేలా చూడనున్నారు. భవనాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని, సుహృద్భావ వాతావరణంలో ఇరు రాష్ట్రాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని స్పీకర్లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.