బాదం.. ఆరోగ్యవేదం!
నగర జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా ఎన్నో వ్యాధుల బారిన పడాల్సివస్తోంది. ఒత్తిళ్లతో పలు రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు బాదం పప్పు ఎంతో ఉపయోగకారి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం నుంచి థైరాయిడ్ తదితర సమస్యలు.. హృద్రోగం నుంచి కాలేయ సంబంధ వ్యాధుల వరకూ ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడే సుగుణాలు బాదం పప్పులో ఉన్నాయంటున్నారు. నగరంలో బాదం వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న తల్లిదండ్రులు.. బాదంతో చేసిన పదార్థాలను అందిస్తున్నారు. కింగ్ ఆఫ్ ది నట్స్‌గా పిలిచే బాదంపై నగర వాసులు మక్కువ చూపుతున్నారని కాలిఫోర్నియా ఆల్మండ్స్ సంస్థ నిర్వహించిన సర్వే పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. నగరంలో 2015తో పోల్చితే 2018 నాటికి బాదం వినియోగం విరివిగా పెరిగిందని వెల్లడైంది. రోజుకు కొన్ని బాదం పలుకులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడించాయి.
హిమాయత్‌నగర్ : బాదం పప్పు.. శరీరానికి కావాల్సిన పోషకాలను మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. శరీరానికిఅవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్లు, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, సోడియం వంటి ఖనిజాలు ఇందులో విరివిగా లభిస్తాయి. బాదంలో మాంసకత్తులు ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులుంటాయి. అంతే కాదు.. శరీరంలోని వ్యర్థ పదార్థాల్ని బయటకు పంపించే గుణం దీని సొంతం. ఇందులో ఉండే ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్‌లా
పనిచేస్తుంది.
సకల రోగనివారిణి..
రోజుకు 7 గ్రాముల బాదం తింటే ఎల్డీఎల్ కొవ్వు స్థాయి 15 శాతం వరకు తగ్గుతుంది. నిత్యం ఆరు గ్రాముల బాదం తింటే దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. ఒస్టియోఫోరోసిస్ అనే వ్యాధి దూరమవుతుంది. పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకుంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అలసటగా అనిపించినప్పుడు 4 బాదం గింజలు తీసుకుంటే చాలు.. తక్షణ శక్తి సొంతమవుతుంది. ఇందులోని రైబోఫ్లోవిన్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి శక్తి అందిస్తాయి. దూర ప్రయాణం చేసేటప్పుడు, ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు కొన్ని బాదం గింజలు వెంట తీసుకెళ్లడం ఎంతో మంచిది. మలబద్ధకం, ఇతర సమస్యలు ఉన్న వారు రోజుకు 5 బాదం పప్పులు తిని బాగా నీళ్లు తాగితే చాలు.. మలబద్ధకం, అజీర్తి సమస్య ఇట్టే మటుమాయమవుతుంది. మధుమేహంతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత కొన్ని బాదం గింజలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది.
పిల్లల జ్ఞాపకశక్తికి మంత్రం..
³ల్లల్లో మందగించిన జ్ఞాపకశక్తిని పెంపొందించే మంత్రం బాదంలో ఉంది. నీళ్లలో మూడు బాదం గింజలు నానబెట్టి మర్నాడు ఉదయం వాటి పొట్టు తీసి పిల్లలకు రోజూ తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదం తినడం వల్ల పేగు కేన్సర్ దరి చేరదు. అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం బాదం తినడం వల్ల ప్లాస్మా, ఎర్రరక్తకణాల్లో ఈ విటమిన్ శాతం గణనీయంగా పెరుగుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగి బీపీ దూరమవుతుంది. వీటిలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. గర్భిణులు తింటే ప్రసవ సమయంలో
ఇబ్బందుల్ని తగ్గుతాయి.
అల్పాహారంగా తీసుకోవడంఎంతో మంచిది..
బాదం పప్పులు ప్రతిరోజూ తింటే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. గుండెకు, మధుమేహానికి, శరీర బరువు తగ్గించడానికి, పెంచుకోడానికి బాదం మంచి ఉపాయం. పిల్లలైనా, పెద్దలైనా రోజుకు 23 బాదం పప్పులు తింటే చాలు. ఇందులోని 15 రకాల పోషకాలు.. వ్యాధుల్ని దూరం చేస్తాయి. బాదం పప్పును అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. శరీరంలో కొవ్వు కరుగుతుంది. రోగులకు బాదం తీసుకోమని సలహా ఇస్తున్నాం. – డాక్టర్ హర్షద్ పుంజానీ, అపోలో హాస్పిటల్, హైదర్‌గూడ
143 గ్రాముల బాదం పప్పులో పోషక విలువలు ఇలా..
తేమ + 6.31గ్రా ప్రోటీన్లు + 30.24 గ్రా
పిండిపదార్థాలు + 30.82 గ్రా చక్కెర + 6.01 గ్రా
పీచుపదార్థం + 17.9 గ్రా శక్తి + 828
కేలరీలు మొత్తం ఫ్యాట్ 71.4 గ్రాములు