సిక్స్ కొట్టాడు, కానిస్టేబుల్ కన్ను పోయింది...
కోల్‌కతా : క్రికెట్లో ఆటగాడు పరుగుల వర్షం కురిసిస్తే అభిమానులకు పండుగే పండుగ. ఇక ఓ సిక్స్ పీకితే ... ఫ్యాన్స్‌కు సందడే సందడి. అయితే ఆటగాడు కొట్టిన ఓ బంతి తగిలి.. ఓ కానిస్టేబుల్ శాశ్వతంగా కంటిచూపు కోల్పోయాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం (మే 9) కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతి సిక్స్ వెళ్లింది.
విధుల్లో భాగంగా బందోబస్తుకు వచ్చిన అలోక్ అనే పోలీస్ కానిస్టేబుల్ (57)ను తాకింది. బంతి బలంగా అతడి కంటికి తగలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అలోక్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి కంటిచూపు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో అలోక్ తన కుడి కంటి చూపును కోల్పోయాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా అలోక్ కోల్‌కతా అయిదో బెటాలియన్ డీఎస్పీ దేబాశిష్ సర్కార్ వాహనానికి డ్రైవర్ గా పని చేస్తున్నాడు.