రిపోర్ట్ చేయకుంటే సీటు రద్దు
ఒక్కో ఐఐటీలో ఒక్కో రోజు తరగతుల ప్రారంభం
వెబ్సైట్లో రిపోర్టింగ్ తేదీలు
హైదరాబాద్: ఐఐటీలో సీట్ల కేటాయింపు, విద్యార్థులు ఆమోదం తెలిపే ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. దీంతో ఐఐటీ వారీగా విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన తేదీలు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన తేదీల వివరాలను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జేఓఎస్ఏఏ) ప్రకటించింది. అలాగే విద్యార్థులకు ఓరియెంటేషన్తోపాటు తరగతులు ప్రారంభించే తేదీల వివరాలను ఐఐటీల వారీగా వెల్లడించింది. అయితే ఒక్కో ఐఐటీకి ఒక్కో విధంగా ఫీజులు ఉన్నాయి.
దీంతో ఐఐటీ వారీగా ఫీజుల వివరాలను జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తనకు సీటు వచ్చిన ఐఐటీలో చేరేందుకు విద్యార్థి అంగీకారం తెలియజేసినా రిపోర్టింగ్ సమయానికి కాలేజీకి వెళ్లకపోతే ఆ సీటు రద్దవుతుందని పేర్కొంది. నిర్ణీత సమయంలో కాలేజీలో చేరాలని స్పష్టం చేసింది. ఒక్కో ఐఐటీలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఓరియెంటేషన్ తరగతులకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలని తెలిపింది.