ప్రైవేటుతో కలసి ఉపగ్రహాలు
తొలిసారిగా చేతులు కలిపిన ఇస్రో
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. తొలిసారిగా ప్రైవేటు భాగస్వామ్యంతో భారత సమాచార వ్యవస్థకు సంబంధించి రెండు భారీ ఉపగ్రహాలను రూపొందిస్తోంది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన అత్యాధునిక రక్షణ పరికరాలు సరఫరా చేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైవేటు రంగంలోని నిపుణుల బృందం... ప్రభుత్వ ఇంజనీర్లతో కలసి ఇందుకోసం శ్రమిస్తోంది. త్వరలోనే ఈ ఉపగ్రహాలు నింగిలోకి దూసుకుపోనున్నాయి. ఇస్రో పూర్తిస్థాయి సమాచార ఉపగ్రహాల తయారీకి తొలిసారి ప్రైవేటు పరిశ్రమతో చేతులు కలపడం విశేషం.
శ్రమిస్తున్న 70 మంది ఇంజనీర్లు...
ఈ ప్రాజెక్టులో భాగంగా 6 నెలల్లో ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు 70 మంది ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ చైర్మన్, ఎండీ కల్నల్ హెచ్ఎస్ శంకర్ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కంస్టాలేషన్) వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు కక్ష్యలో ఉండగా, అత్యవసర పరిస్థితుల్లో స్టాండ్‌బైగా వీటిని రూపొందిస్తున్నారు. ఇందుకు రూ.400 కోట్లకు ఆల్ఫా డిజైన్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. ‘కోట్ల రూపాయల విలువైన ఉపగ్రహాల తయారీ ఎంతో క్లిష్టమైనది. ఇవి అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాతా మరమ్మతులు రాకుండా ఏళ్లతరబడి పనిచేయాల్సి ఉంటుంది.
దీంతో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం’ అని ఇస్రో బెంగళూరు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ ఎం.అన్నాదురై చెప్పారు. ‘నావిక్’ కింద తయారైన అన్ని ఉపగ్రహాలకూ 95 శాతానికి పైగా సిస్టమ్స్ బయటి పరిశ్రమ నుంచే అందుతున్నాయన్నారు. ‘మొదటగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఉపగ్రహాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో రూపొందిస్తాం. దాన్ని ఇస్రో నిపుణుల బృందం పరిశీలించి... రెండో ఉపగ్రహ తయారీని అప్పగిస్తుంది’ అని చెప్పారు. అత్యాధునిక అంతరిక్ష పార్కు బెంగళూరులో సిద్ధమైందని, ఇది అందుబాటులోకి వస్తే అన్నీ ఒకేచోట లభించే ఈ తరహా పార్కు ప్రపంచంలోనే తొలిదవుతుందన్నారు.